Caste Census in AP: రాష్ట్రంలో కుల గణనను (Caste Census) వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వాలంటీర్లు (Volunteers), గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్లలో ప్రత్యేక యాప్ (Special App) రూపొందించారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహం జరిగిందా? కులం, ఉపకులం, మతం, రేషన్‌కార్డు నెంబర్‌, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్‌, తాగునీటి సదుపాయం ఉందా? పెంచుకుంటున్న పశువుల సంఖ్య తదితర వివరాలను సేకరిస్తారు.


ప్రత్యేక యాప్


కుల గణన సర్వే కోసం వాలంటీర్ల సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ రూపొందించారు. సర్వే ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి ముగింపు వరకూ వాలంటీర్ ఒకే సెల్ ఫోన్ వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గానీ, పూర్తైన తర్వాత గానీ, స్క్రీన్‌ షాట్‌ లేదా వీడియో రికార్డింగ్‌ చేసేందుకు వీలు లేకుండా యాప్‌ డిజైన్‌ చేశారు. వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా, కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా, అలాంటి వారి వివరాల నమోదుకు మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబీకులే స్థానిక సచివాలయాలకు వెళ్లి వారి వివరాలు అందించాలి. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దాన్నే శాశ్వత చిరునామాగా పరిగణించి వివరాలు నమోదు చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధ్రువీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.


శ్రీకాకుళం, డా.అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్‌, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో సచివాలయంలో జరుగుతున్న ‘కులగణన ప్రయోగాత్మక సర్వే’పై గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. దీనిపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రాథమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై చర్చించారు. యాప్ లో మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఈ - కేవైసీ నమోదులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్‌, ఓటీపీ, వేలిముద్ర, తదితర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. కాగా, వెనుక బడిన తరగతి వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకు రావాలనే లక్ష్యంతోనే ఈ సమగ్ర కులగణన చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  


Also Read: Weather Latest Update: 26న బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఐఎండీ