YSRCP MLA Kona Raghupathi warns YS Sharmila over her remarks against him: విజయవాడ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి అయినందునే షర్మిల (YS Sharmila)ను వదిలిపెట్టామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పై చేస్తున్న కామెంట్లను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిలను విమర్శిస్తే ఓ సమస్య, విమర్శలకు పదునుపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేసినా వారికి సమస్య తప్పదు అన్నట్లుగా ఉంటుంది. బాపట్లలో జరిగిన సభలో సీఎం జగన్, తనపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోన రఘుపతి (Kona Raghupathi) మండిపడ్డారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసింది వైఎస్సార్ కూతురు షర్మిల కాబట్టి బాపట్ల దాటనిచ్చామని.. వేరేవాళ్లయితే పరిస్థితి మరోలా ఉండేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి వ్యాఖ్యలపై మండిపడ్డారు. దివంగత నేత వైఎస్సార్ పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నామని, సీఎం జగన్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని.. కానీ షర్మిలను వైఎస్సార్ కూతురు అన్న కారణంగా వదిలేశాం అన్నారు. ఇదే వ్యాఖ్యలు మరొకరు చేసినట్లయితే ఊరు దాటనిచ్చే వాళ్లం కాదన్నారు.
బాపట్లపై జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా?
షర్మిల రాజకీయం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రోజులు ఎప్పుడో పోయాయంటూ షర్మిలను ఎద్దేవా వేశారు. సోషల్ మీడియా కారణంగా.. చదువున్న వారికి, చదువులేని వారికి అందరికీ విషయాలు తెలుస్తున్నాయన్నారు. బాపట్లలో ఏం అభివృద్ధి జరిగిందని షర్మిల అడగడంపై మండిపడ్డారు. బాపట్లను జిల్లా చేశారని.. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి గతంలో ఎన్నడూలేని విధంగా డెవలప్ చేస్తున్నామని చెప్పారు. బాపట్లపై షర్మిల చేసిన కామెంట్లు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. మాట్లాడితే ఇసుక దందా అని షర్మిల కామెంట్లు చేయడాన్ని తప్పుపట్టారు. దీనిపై గతంలోనే తాను స్పందించానని కోన రఘుపతి తెలిపారు. బాపట్లో వాగులు, వంకలు లేవన్నారు. ఇక్కడున్నది ఇసుక కాదని, మూడు లైన్లు, నాలుగు లైన్లు రావడంతో ఇక్కడున్న ఇసుకను కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
వైఎస్సార్ కూతురు అని వదిలేశాం, లేకపోతే అంటూ వార్నింగ్
రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, ఏదో అనాలి కనుక అంటాం.. కోన రఘుపతిని ఇంకేం అనాలో తెలియక షర్మిల లేనిపోని ఆరోపణలు, కామెంట్లు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. షర్మిల తన గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని, కానీ వైఎస్సార్ కూతురు కనుక ఆమెను ఊరు దాటనిచ్చామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని, ఇంకోసారి ఇలా వదిలేయం జరగదని హెచ్చరించారు. వైఎస్సార్ కుటుంబాన్ని చూసి, వారిపై ఉన్న గౌరవంతో వదిలేశామే కానీ, చేతకాక కాదని పేర్కొన్నారు. మీ పిచ్చి మాటలకు, ఉడత ఊపులకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులు ఎంత మంది వచ్చినా, పెయింగ్ గెస్ట్‌లు ఎంత మంది వచ్చినా వైఎస్సార్ సీపీని, వైఎస్ జగన్‌ను ఏం చేయలేరంటూ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఘాటుగా స్పందించారు.