Prudhvi Shoking Comments: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ (Prudhvi Raj) తన మూడు దశాబ్దాల అనుభవంతో జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి జయకేతనం ఎగరవేయడమే గాక శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అప్రతిహాతంగా దూసుకుపోనుందని తెలిపారు. కూటమి అభ్యర్థులు  భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్నారు. నంద్యాలలో నిర్వహించిన జనసేన( Janasena) కోసం మెగా సైన్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


136 అసెంబ్లీ, 21 ఎంపీలు
తెలుగుదేశం( TDP)-జనసేన(Janasena) కూటమి గెలవబోతున్న మ్యాజిక్ ఫిగర్ ను థర్టీఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ (Prudhvi Raj) తేల్చేశాడు. కూటమి సభ్యులు 136 అసెంబ్లీ స్థానాల్లోనూ, 21 లోక్ సభ సీట్లలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు జోస్యం చెప్పారు. శ్రీకాకుళం మొదలుకుని చిత్తూరు వరకు దాదాపు మెజార్టీ జిల్లాలు క్లీన్ స్వీప్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం(TDP) అనుభవానికి, జనసైనికుల ఉత్సాహం తోడైయితే రాష్ట్రంలో వీరి విజయాన్ని అడ్డుకునే వారే లేరన్నారు. తాను చెప్పిన లెక్కలు ఇప్పటి వరకు ఉన్న సమాచారమేనని...మున్ముందు ఈ రెండు పార్టీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ సంఖ్య మరింత పెరగొచ్చని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో  వైసీపీ(YCP) తరపున ప్రచారం చేసిన పృద్వీకి జగన్(Jagan) అధికారంలోకి రాగానే ఎస్వీబీసీ(SVBC) భక్తి ఛానెల్ ఛైర్మన్ గా నియమించారు. అక్కడ జరిగిన రాజకీయలకు తట్టుకోలేక బయటపడిన పృథ్వీరాజ్ వైసీపీని ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాడు. అనంతరం పవన్ కల్యాణ్(Pavan Kalyan) సమక్షంలో జనసేన పార్టీలో చేరాడు.


డైమండ్ రాణి గుట్టు విప్పుతాం
నంద్యాలలో ‘జనసేన కోసం మెగా సైన్యం'’ కార్యక్రమంలో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. జనసేన-తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ద్విచక్రవాహన ర్యాలీకి పృథ్వీ హాజరయ్యారు. ఈ సందర్భంగా  వైసీపీ(YCP) నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డైమండ్ రాణిపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, తెదేపా- జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామన్నారు. పోలవరం గేట్ల గురించి తెలియని అంబటి రాంబాబు( Ambati Rambabu)కు ఈసారి టికెట్ లేదన్నారు. 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అన్నను అధికారంలోకి తీసుకొస్తే చెల్లికి,తల్లికి కూడా న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని పృథ్వీ ఎద్దేవా చేశారు. నిత్యం బీసీలు, ఎస్సీలు, మైనార్టీల జపం చేసే జగన్ వారికి ఉన్న 26 పథకాలను ఎత్తేశాడని విమర్శించారు.  శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎవరిని అడిగినా జగవ్ అరాచక పాలన గురించి కథలు కథలుగా చెబుతారన్నారు. మెగా ఫ్యాన్స్ మొత్తం పవన్ వెంటే నడుస్తుందని హామీ ఇచ్చారు
జానీమాస్టర్ ఝలక్
పవన్ కల్యాణ్ ను ఇష్టానుసారం దూషిస్తే జనసైనికులుగా తాము చూస్తూ ఊరుకోబోమని ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీమాస్టార్(Jani Master) హెచ్చరించారు. ఇటీవలే జనసేనలో చేరిన ఆయన... జనసైనికులతో కలిసి నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. గ‌త ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు ప్రస్తుతం స‌రైన నిర్వహ‌ణ‌, ప‌ర్యవేక్షణ లేదని విమర్శించారు. పవన్ ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగతంగా  విమర్శిస్తున్నారని జానీ మండిపడ్డారు. రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలని ఆయన సూచించారు. ఇకపై తమ  నేతను ఏమైనా అంటే సహించేది లేదని హెచ్చరించారు.