Eatala Rajender criticized congress budget :  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఈటల రాజేందర్  విమర్శలు చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్ ఉందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు. బడ్జెట్ అంచనాలకు, ఖర్చుకు సంబంధం లేకుండా పోతుందంటూ ఏకరువు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23 బడ్జెట్ లో రూ. 2,56,958.51 కోట్లుగా ప్రతిపాదిస్తే.. రివైస్డ్ బడ్జెట్ రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా అంచనా వేశారు. ఖర్చు చేసింది కేవలం రూ. 2లక్షల 4 వేల 500 కోట్లు మాత్రమే. 2022-23 బడ్జెట్ 1/5వ వంతు రియాల్టీకి దూరంగా ఉందన్నారు. 66 వేల కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చుపెట్టబోమని చూపించారని, అంటే అంకెలు తప్ప ఆచరణలో ఖర్చు ఉండదని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్లలో 40 వేల కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టే ఆస్కారం లేదన్నారు ఈటల.


ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే.. రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే హామీలు అమలయ్యేలా కనపడుతున్నాయని చెప్పారు. బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతుబంధు (భరోసా) కోసం రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇవన్నీ అమలు చేయాలంటే ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రుణమాఫీ ఈ సంవత్సరం ఉంటుందా? లేదా? స్పష్టత ఇవ్వలేదన్నారు. అంటే రైతులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు ఉత్తదేనని ఆరోపించారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తమని కాంగ్రెస్ ప్రకటించిందని, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉందని, అయితే బడ్జెట్ లో మాత్రం ఎక్కడా నిధులు కేటాయించలేదంటూ ప్రస్తావించారు.


ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగికి రూ. 4 వేలు ఇస్తామనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రస్తావించలేదు. కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే ప్రజలు నవ్వుకునేలా ఉంది తప్పితే.. వారి ఆశలు నెవరేర్చేలా లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 66 అంశాలు ప్రస్తావించారు.రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీ ప్రజానీకానికి ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కాంగ్రెస్ చెప్పింది. అయితే, బడ్జెట్ లో కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించిన్రు.బడ్జెట్ ను చూస్తే బీసీల అభ్యున్నతి కోసం రూపాయి ఖర్చు పెట్టే ఆస్కార లేదని ఆయన అన్నారు.


బిహార్ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ లో 15 శాతం మేర విద్యకోసం ఖర్చు పెడుతున్నారని చెప్పారు. కాని 7శాతం నిధులు పెట్టారు. విద్యా రంగానికి పెట్టే ఖర్చులో కేవలం ఉద్యోగులకు జీతభత్యాలకు మాత్రమే నిధులు సరిపోతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఉపాధి లేక ఆటోలు నడుపుకునే దుస్థితి ఎదురైంది. ఆటో డ్రైవర్లు ఆదాయం రాక వేదనతో ఆటోలకు నిప్పంటించుకున్న ఘటనలు చూశాం. ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం రూ. 12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాని, బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. మహిళా గ్రూపులకు రూ. 10 లక్షల చొప్పున పావలా వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్.. బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. దళితబంధు, దళిత సబ్ ప్లాన్ అమలుకు బడ్జెట్ లో కేటాయింపుల్లేవు. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తారా.. లేక బంద్ చేస్తున్నారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హుజురాబాద్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లో దళితబంధుకు నోచుకోని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గొల్ల కురుమలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయంపై స్పష్టత కనపడటం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదని  హెచ్చరించారు.