Telangana Budget 2024-25: హైదరాబాద్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ తొలి బడ్జెట్‌పై తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఘాటుగా స్పందించారు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లయింది తెలంగాణ బడ్జెట్ అని సెటైర్లు వేశారు. తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్తెసరు నిధులు కేటాయించారంటూ వ్యవసాయ శాఖా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేసిన కేటాయింపుల కన్నా తక్కువ కేటాయింపులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.


కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ లో రూ.7085 వేల కోట్లు కోత పడిందన్నారు. గత బడ్జెట్ లో రూ.26,831 కోట్లు తాము కేటాయించగా.. ఈ బడ్జెట్ లో కేవలం రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం, వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అని హామీలలో కాంగ్రెస్ ప్రకటించింది. వీటికి నేటి బడ్జెట్ ప్రకటనతో మంగళం పాడినట్లేనా అని ఎద్దేవా చేశారు. 


కేసీఆర్ ఇచ్చిన లెక్కల ప్రకారం చూసినా రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుభీమాకు రూ.1500 కోట్లు కావాలన్నారు. కాంగ్రెస్ రైతుభరోసా లెక్కన ఎకరాకు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బడ్జెట్ లో రుణమాఫీ ఊసేలేదని, కాంగ్రెస్ నేతలు అధికారం కోసం అన్ని వర్గాలను రెచ్చగొట్టి అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు. అధికారం దక్కాక ఎడారిలో ఎండమావిని చూయిస్తున్నారు. రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, 24 గంటల కరంటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. 


అధికారం ఇస్తే డిసెంబరు 9న ఏకకాలంలో ఒక్క సంతకంతో రుణమాఫీ అని చెప్పినా.. యాసంగి సీజన్ సగానికి వచ్చినా కనీసం సగం మంది రైతులకు రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ చేయలేదు అన్నారు. ప్రతి సీజన్ కు ఠంచనుగా వచ్చే రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లు ఎంతో కష్టపడి ప్రణాళికాబద్దంగా పనిచేసి వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపామని పేర్కొన్నారు. ఆకలికేకల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా నిలిపాం. కానీ కాంగ్రెస్ పాలన ఆత్మస్తుతి పరనింద అన్నట్లు కొనసాగుతోందని, 
వాళ్లు అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే నీలినీడలు కమ్ముకున్నాయని అభిప్రాయపడ్డారు. 


కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ రైతాంగంలో అప్పుడే అసంతృప్తి మొదలయిందన్నారు. కాంగ్రెస్ మోసాన్ని రాజకీయంగా ఎండగట్టి రైతాంగాన్ని చైతన్యవంతం చేస్తామని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్తెసరు నిధులు కేటాయించారంటూ శనివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు.