Kakinada Crime News: కాకినాడ జిల్లాలో ఇటీవల కాలంగా దొంగలు చెలరేగిపోతున్నారు.. ఏకంగా బ్యాంకుకే కన్నం వేసి రూ.75లక్షల విలువ చేసే బంగారం, రూ.27 లక్షలు నగదును అపహరించారు. బ్యాంకు భవనం వెనుక భాగంలో కిటికీ గ్రిల్స్‌ను గ్యాస్ కట్టర్లతో తొలగించిన దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ప్రత్తిపాడులో కలకలం రేగింది.
బ్యాంకు కిటికి ఉన్న గ్రిల్స్‌ను తొలగించి బ్యాంకులోకి చొరబడి దొంగతనం చేశారన్న వార్త దావనంలా వ్యాపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో నేరుగా కాకినాడ జిల్లా ఎస్సీ సతీష్ కుమార్ రంగంలోకి దిగారు. హుటాహుటిన ప్రత్తిపాడు విచ్చేసిన ఎస్సీ క్లూస్ టీంతోపాటు జాగిలాలను రప్పించి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
రాత్రివేళల్లో గ్యాస్ కట్టర్లుతో తొలగించి...
బ్యాంకు వెనుక భాగంలో చేలు ఉండడంతో దొంగలకు పని చాలా సులభంగా మారినట్లయ్యింది. వెనుక భాగంలో కిటికి ఐరన్ గ్రిల్స్‌ను గ్యాస్ కట్టర్లుతో సునాయాసంగా తొలగించారు. దీంతో ఎటువంటి చప్పుడు లేకుండా బ్యాంకులోకి చొరబడేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కొంత కాలంగా రెక్కీ నిర్వహించిన కేటుగాళ్లు పథకం ప్రకారం రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో బ్యాంకులోకి చొరబడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేవలం మూడున్నర గంటల వ్యవధిలోనే బ్యాంకులో ఉన్న సొమ్మును కొల్లగొట్టినల్లు తెలుస్తోంది..
లాకర్లను కూడా గ్యాస్ కట్టర్లతో తొలగించి..
కిటికీ గ్రిల్స్‌ను గ్యాస్ కట్టర్లతో తొలగించిన దొంగలు బ్యాంకులో నాలుగు లాకర్లలో ఉన్న రూ.27 లక్షలు నగదు, 25 బ్యాగుల్లో ఉన్న రూ.75లక్షల విలువ చేసే బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ దోపిడీలో ఆరుగురు దొంగలు పాల్గన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.. బ్యాంకులోకి దుండగులు ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇద్దరు కారు వద్దనే ఉండగా నలుగురు బ్యాంకులో చొరబడి దోచుకెళ్లారు. బ్యాంకు లాకర్లను తొలగించిన విధానం బట్టి దోపిడీ ముఠా కచ్చితంగా ప్రొఫెషనల్స్ అని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకును ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ కె.లతాకుమారి సిబ్బంది పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఖాతాదారులెవ్వరూ ఆందోళన చెందవద్దని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.