Demand For Bharat Ratna to NTR: తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు భారత రత్న(Bharat Ratna) ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌(NTR)కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 


మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం రావడంపై సినీ, రాజకీయ సహా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తికి కారణమైన పీవీ లాంటి వాళ్లకు నిజంగా దక్కాల్సిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. అదే టైంలో తెలుగు జాతీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌కి కూడా భారత రత్న ఇచ్చి ఉంటే తెలుగు నేల పులకించిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటించాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటీ, రాజకీయ నాయకురాలు విజయశాంతి. ట్విటర్ వేదికగా పీవీకి భారత రత్న ఇవ్వడంపై స్పందించిన ఆమె... అదే గౌరవం ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నటుడిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకొని భారతరత్న ప్రకటించి ఉంటే యావత్ తెలుగు జాతి మరింత పులకించిపోయేదన్నారు. 


ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని పార్టీలు భుజానకెత్తుకోవాలని అభిప్రాయపడ్డారు విజయశాంతి. దీన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని సూచించారు. 






ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలు గర్వించదగ్గ నందమూరి తారక రామారావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ప్రధానమంత్రికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రిక్వస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలు, భారతీయ చలనచిత్రం, సమాజానికి ఆయన చేసిన విశేషమైన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు.  ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో ఆయనను సత్కరించడం ఆయన వారసత్వానికి తగిన నివాళి అందించినట్టే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ని దయచేసి పరిశీలించాలన్నారు.