Andhra Pradesh News: రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చర్చలు దాదాపు సఫలమైనట్టేనని ఇరు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగనున్నాయి. ఈ రెండు రోజుల్లో ఏమైనా అనూహ్య పరిణామాలు చేసుకుంటే తప్పా పొత్తు ఖరారైనట్టే. ఈ పొత్తుపై టీడీపీ, జనసేన శ్రేణులు నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. గతంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లినా, బీజేపీ పెద్దలను ఎవరిని కలిసినా పెద్ద ఎత్తున హంగామా చేసేవి. టీడీపీ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కల్పించేవి. కానీ, తాజా భేటీ, పొత్తుపై మాత్రం టీడీపీ అనుకూల మీడియా గానీ, ఇరు పార్టీల శ్రేణులు ఆశించిన స్థాయిలో సానుకూలంగా స్పందించలేదు. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. 


బలవంతపు పొత్తు అన్న ప్రచారం


బీజేపీతో పొత్తు తప్పడం లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను హైలెట్‌ చేస్తూ గురువారం టీడీపీ అనుకూల మీడియా ప్రధాన కథనాన్ని ప్రచురించింది. ఇదే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో కొంత ఆందోళనకు కారణమవుతోందని చెబుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అత్యధిక స్థానాలను కోరడం, దాన్ని చంద్రబాబు కాదనలేని పరిస్థితి ఏర్పడడం వల్లే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని పలువురు చెబుతున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసినప్పుడు నాలుగు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. ఇప్పుడు బీజేపీ అంతకంటే ఎక్కువ స్థానాలు అడుగుతున్నట్టు చెబుతున్నారు. ఎనిమిద వరకు ఎంపీ స్థానాలను బీజేపీ అగ్ర నాయకులు అడిగారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అయిష్టంగానే చంద్రబాబు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, లేకపోతే పొత్తుకు అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తేగానీ వాస్తవం ఏమిటన్నది తెలియదు. 


పొత్తు ఓకే.. సీట్లపైనా కేడర్‌లో అసహనం


బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ ఓట్ల పరంగా పెద్దగా తమకు లబ్ధి చేకూరదన్న భావన తెలుగుదేశం కేడర్‌లో ఉంది. కానీ, కేంద్ర స్థాయిలో ఉన్న సంస్థలు నుంచి సహకారం అందుతుందన్న ఉద్ధేశంతోనే టీడీపీ శ్రేణులు బీజేపీతో పొత్తును కోరుకుంటున్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందన్న లెక్కలు కూడా బీజేపీతో పొత్తును కోరుకునేందుకు కారణంగా చెబుతున్నారు. కానీ, భారీగా సీట్లు ఇవ్వడం వల్ల గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని, దీనివల్ల వైసీపీకి లబ్ధి చేకూరుతుందని టీడీపీతోపాటు జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకునే టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి చేయకుండా సైలెంట్‌గా ఉన్నాయి. పొత్తుపై ఇరు పక్షాలు నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడమూ దీనికి కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా గతానికి భిన్నంగా టీడీపీ, జనసేన శ్రేణులు పొత్తు చర్చలపై మౌనాన్ని దాల్చడం ఆసక్తిని కలిగిస్తోంది.