అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రజలు చెబుతూనే ఉంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచొట్ల రోడ్లు పూర్తికాగా, కొన్నిచోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు (ఆర్‌ఐడీఎఫ్‌) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న 1,250 కి.మీ గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్ల నాబార్డ్‌ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధులు త్వరలో విడుదల కానున్నాయి. గుంతలు పూడ్చినా రోడ్లు సెట్ అయ్యే అవకాశం లేని 191 గ్రామీణ రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.