Amaravati Fire Accident: అమరావతిలో ప్రధాని మోదీ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే సభకు దూరంగా .. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో అగ్నిప్రమాదం జరిగింది. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన పైపులకు దండగులు నిప్పు పెట్టారు.  ప్రధాని మోదీ ఓ వైపు అమరావతి ఓ శక్తి అని  ప్రసంగిస్తున్న సమయంలో దూరంగా పెద్ద ఎత్తున గాల్లోకి పొగ వెళ్తూ కనిపించింది. పొగను చూసి ఫైర్ అధికారులు హుటాహుటిన వెళ్లి వాటిని ఆర్పేశారు.  

 ఎండలకు కాలిపోయేందుకు అవేమీ మండే గుణం ఉన్న పైపులు కాదని అధికారులు చెబుతున్నారు. గడ్డి పరకలు అయితే ఎండకు కాలిపోతాయేమో కానీ పైపులు ఎలా కాలుతాయన్న ప్రశ్న వస్తుంది. అదీ కూడా సభ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పొగలు వచ్చేలా కాల్చారని..ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు. పైపులపై పెట్రోల్ పోసి కాల్చేశారని సులువుగానే అర్థమైపోతుందని అధికార వర్గాలు అంటున్నాయి. 

నిఘా లేని చోట.. అమరావతి పైపులు ఉన్న చోట చూసి నిప్పు పెట్టిపోయారు. గతంలో అరటితోటలకు నిప్పు పెట్టేవారు.  ఇప్పుడు నిప్పు పెట్టడానికి అరటి తోటలు లేవని.. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన పైపులకు నిప్పు పెట్టారని అమరావతి రైతులు మండి పడుతున్నారు.