Amaravati: అమరావతి పనులు పునః ప్రారంభం వేదికపై చాలా ఆసక్తికరమైన ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... టెక్నాలజీని గొప్పగా  వాడుకోవడంలో ప్రధానమంత్రి మోదీ తర్వాత ఎవరైనా అంటూ కితాబు ఇచ్చారు. ఈ విషయంలో ఆయన్ని అధిగమించే వాళ్లు లేరని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వస్తున్న ఐటీ కంపెనీలు, ఇతర టెక్నాలజీ సంస్థలను వివరించి చెప్పారు. 

చంద్రబాబు పరుగులు పెట్టించారు: మోదీ అమరావతి మీటింగ్‌లో కీలక ఉపన్యాం చేసిన ప్రధానమంత్రి మోదీ మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాను తొలిసారి గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయినప్పుడు ఐటీ విషయంలో చంద్రబాబు చేసే చర్యలను చాలా దగ్గరగా గమనించామన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ చాలా కంపెనీలను తీసుకొచ్చే వాళ్లని ఇదెలా సాధ్యమని ప్రత్యేకంగా ఓ టీంను పెట్టి చంద్రబాబు చర్యలను గమనించే వాళ్లమని అన్నారు. ఒక రకంగా చంద్రబాబు తమను పరుగులు పెట్టించారని అన్నారు. అదే ఎక్స్‌పీరియన్స్‌ ఇప్పుడు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడ నేను ఏదో టెక్నాలజీలో మేటీ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు.  

భారీ పనులు చేయాలంటే చంద్రబాబే: మోదీ

ఏదైనా పెద్దగా ఆలోచించి విజయవంతంగా పూర్తి చేయాలంటే చంద్రబాబుకే సాధ్యమన్నారు ప్రధానమంత్రి మోదీ. ఇప్పుడు అమరావతి కూడా అదే శక్తితో పూర్తి చేస్తారని అభిప్రాయపడ్డారు. మధ్య మధ్యలో ప్రధానమంత్రి మోదీ తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఈ అమరావతి కోట్ల మంది యువకులు ఆశలు పెట్టుకున్నారని అందుకే మనం పూర్తి చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు పిలుపునిచ్చారు.