Amaravati will be the foundation of a developed India: అమరావతి అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదని..  ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు బలమైన పునాదులు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అమరావతి పునంప్రారంభం సభలో మోదీ ప్రసంగించారు.  ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తోందని అన్నారు. ప్రసంగాన్ని తెలుగులో  ప్రారంభించిన మోదీ.. దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా .. ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుందన్నారు. దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇంద్రలోకం రాజధాని అమరావతి

ఇంద్రలోకం రాజధాని పేరు అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే..స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ఇది శుభసంకేతమన్నారు.  ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుందని.. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుందని హామీ ఇచ్చారు.  హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు.  

పెద్ద పెద్ద పనులు చేపట్టడంలో చంద్రబాబును మించిన నేత లేరు

టెక్నాలజీ నాతో మొదలైనట్లు చంద్రబాబు ప్రశంసించారు నేను గుజరాత్‌ సీఎం అయినప్పుడు హైదరాబాద్‌లో ఐటీని ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానని మోదీ తెలిపారు.  ప్రత్యేకంగా అధికారులను పంపి హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా:.. ఏవైనా పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తిచేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. పెద్దపెద్ద పనులు పూర్తిచేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని మోదీ ప్రశసించారు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశానని గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచిందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్నిరకాలుగా సహకరించిందని తెలిపారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుందన్నారు. అమరావతిలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ సహా అన్నిరకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు ఉంటుందన్నారు.

ఎన్టీఆర్ ఆశయాల కోసం పని చేయాలి

ఎన్టీఆర్‌.. వికసిత ఏపీ కోసం కలగన్నారు మనందరం కలిసి ఎన్టీఆర్‌ కలల్ని నిజం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌కు ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదగాలన్నారు.  ఇది మనం చేయాలి.. మనమే చేయాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలిచింది.. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల సాయం చేస్తోందన్నారు.  ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది.. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది..ఈ అనుసంధానం తీర్థయాత్రలకు, పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు.  వికసిత్‌ భారత్‌ నిర్మాణం కావాలంటే పేదలు, యువత అభివృద్ధి చెందాలలని.. వికసిత్‌ భారత్‌ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలని మోదీ అన్నారు.  ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారన్నారు.