AP Three Capitals News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడి ఉంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల మంత్రులు కూడా వివిధ సందర్భాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని స్పష్టం చేశారు. ఇలాంటి సమ‌యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజ‌ధాని విష‌యంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ కు షాక్ ఇచ్చింది. మూడు రాజ‌ధానుల విష‌యంలో ఏపీ ప్రభుత్వాన్ని నిరాశకు గురి చేసింది. కేవ‌లం ఒక్క రాజ‌ధానికే నిధుల కేటాయింపులు ఉంటాయ‌ని స్పష్టం చేసింది.


ఉన్నట్టుండి ఈ ప్రకటన ఎందుకంటే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ‌జ‌న సంద‌ర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తరచూ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటన ప్రతిసారి రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రులను కలవడం, వినతి పత్రాలు సమర్పించడం రివాజుగా మారింది. అయినా ఆ హామీలు నెరవేరడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభ‌జ‌న అంశాల‌పై చ‌ర్చలు జ‌ర‌ప‌నుంది. అందుకోసం ఈనెల 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చ‌ర్చకు సంబంధించిన ఏజెండాను ప్రక‌టించింది.


అజెండాలో ఏముందంటే
సెప్టెంబరు 27న జరగబోయే సమావేశానికి సంబంధించిన అజెండాలో కీల‌క అంశాల‌ను కేంద్రం పేర్కొంది. విభ‌జ‌న‌ చ‌ట్టం ప్రకార‌ం కేంద్ర రాజ‌ధాని విష‌యంలో ఏపీకి స‌హ‌కారం ఉంటుంద‌ని స్పష్టం చేసింది. అయితే, ఒక్క రాజ‌ధానికి మాత్రమే సాయం అంటూ ప్రస్తావించింది. జగన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న మూడు రాజ‌ధానుల ప్రస్తావ‌న తీసుకురాలేదు. మొద‌టి నుంచి మూడు రాజధానులు అంటూ చెబుతూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశం కాస్త ఇబ్బంది కలిగించేదే. 


మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామంటూ ఇటీవల మంత్రులు కూడా వివిధ సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కోర్టు ర‌ద్దు చేసిన బిల్లు స్థానంలో మరో బిల్లు వచ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో పెడదామని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఒక్క రాజ‌ధానికే తమ సాయం ఉంటుందని ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి నిరాశ కలిగించే అంశమే అవుతుంది.


ఇతర అంశాలు కూడా..
రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో పేర్కొన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన షెడ్యూల్‌ 10లో పేర్కొన్న సంస్థల విభజన రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావన లేని సంస్థల విభజన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ విభజన సింగరేణి, ఆంధ్రప్రదేశ్‌ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ సంస్థల విభజన, నగదు, బ్యాంకు బ్యాలెన్సు విభజన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు బకాయి ఉన్న క్యాష్‌ క్రెడిట్‌, 2014-15కి సంబంధించి ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీపై విడుదల తదితర విభజన హామీల సమస్యలపై కేంద్రం ఈ సమావేశంలో ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.


Also Read: కేఏపాల్‌కు షాక్‌ ఇచ్చిన ఈసీ- ఇనాక్టివ్ జాబితాలో ప్రజాశాంతి పార్టీ