Rains in Telangana AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై తగ్గింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తక్కువ వర్షపాతం ఉండటంతో ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ చేయలేదు వాతావరణ కేంద్రం. 
తెలంగాణలో వర్షాలు 
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై క్రమంగా తగ్గుతోంది. నేడు కొన్ని జిల్లాల్లోనే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ కాలేదు. 
నేడు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 22, గరిష్ట ఉష్ణోగ్రత 30గా నమోదైంది. నైరుతి దిశ నుంగి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  





ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. విశాఖ నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ఏపీపై క్రమంగా తగ్గుతోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది.  మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రి సమయంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్.టీ.ఆర్., కృష్ణా అక్కడక్కడా చిరుజల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కొన్నిచోట్ల దారి లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.