రూబీ లాడ్జి విషాద ఘటనపై తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్‌ నివేదిక విడుదల చేసింది. మూడు పేజీల రిపోర్ట్‌లో కీలకమైన విషయాలు వెల్లడించారు అధికారులు. యజమాని నిర్లక్ష్యం కారణంగానే ప్రమాద తీవ్ర పెరిగిందన నివేదికలో స్పష్టం చేసింది.  


లిథియం బ్యాటరీల పేలుళ్ల వల్లే దట్టమైన పొగలు వ్యాపించాయని తేల్చింది తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. పొగలు వల్ల భవనంలోకి వెళ్లలేకపోయామని ఫైర్ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. భవనానికి సింగిల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ మాత్రమే ఉన్నట్టు నివేదికలో వెల్లడించింది. లిఫ్ట్‌ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యజమాని పట్టించుకోలేదని తెలిపింది. 


అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పని చేయలేదని.. భవనం మొత్తం కూడా క్లోజ్‌ సర్క్యూట్‌లో ఉండిపోయిందని అగ్నిమాపక విభాగం స్పష్టం చేసింది. భవనానికి కనీసం కారిడార్‌ కూడా లేదని.. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ కనిపించలేదని పేర్కొంది. భవన, హోటల్‌ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం జరిగిందని క్లియర్‌ అయినట్టు వెల్లడించింది. మొదటిగా సెల్లార్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తర్వాత ఆ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని రిపోర్ట్‌లో తెలిపింది. 


అసలేం జరిగిందంటే..? 
సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. బైక్ షోరూమ్ లో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసి పడ్డాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి లాడ్జిలో ఉన్నవారు చనిపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని తెలిపారు. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. రూబీ హోటల్ లో మొత్తం నాలుగు ఫోర్లలో 23 రూమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు ఫోర్లలోని వారు చనిపోయారని సీపీ తెలిపారు. ఆరుగురి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని యశోధ ఆసుపత్రికి తరలించారు. మంటలు వ్యాపించినట్లు హోటల్ పై నుంచి దూకిన వారెవరూ చనిపోలేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా 
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘‘బిల్డింగ్ సెల్లర్ ని మిస్ యూస్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. 8 మంది స్మోక్ ద్వారానే చనిపోయారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.