TRS on YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని స్పీకర్ నోటీసుకు తీసుకొచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. చట్టసభల ప్రతినిధులు అనే స్పృహ లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్ కు తెలిపారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తామన్న స్పీకర్ .. ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని హామీ ఇచ్చారు.
సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫారుసు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్, మంత్రులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని స్పీకర్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఫిర్యాదుపై సభాహక్కుల ఉల్లంఘన కమిటీ బుధవారం సమావేశమయ్యే అవకాశముంది. అయితే ఇప్పటికే షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.
స్పీకర్ కు షర్మిల ట్వీట్
నిరుద్యోగ యువతకు తోడుగా తాను చేస్తున్న దీక్షలను అవహేళన చేసిన మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకోవాలని షర్మిల స్పీకర్ ను కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్టర్లో స్పీకర్ టాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర (PrajaPrasthanam) కొనసాగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గం వనపర్తి. అయితే తన పాదయాత్రలో భాగంగా షర్మిల ఇటీవల వనపర్తిలో మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు (చెప్పు) దెబ్బలు పడుతయ్ అని హెచ్చరించారు. యువత హమాలీ పని చేసుకోవాలని, రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా? అంటూ మండిపడ్డారు.
మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల కోసం తాను ప్రతి మంగళవారం నాడు నిరాహార దీక్షలు చేస్తుంటే.. నిరంజన్ ఏమన్నాడంటే ప్రతి మంగళవారం మరదలు అని కామెంట్ చేశాడని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వదిలి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వైఎస్సార్ టీపీ పోరాడుతోందన్నారు. కానీ మంత్రి అధికార మదంతో మాట్లాడుతున్నారని, ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు అంటూ మంత్రిపై మండిపడ్డారు.
Also Read : Ys Sharmila Comments: ఎవర్రా నీకు మరదలు, మెట్టుతో కొడతాను - మంత్రిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు