NPS Pension Rules: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పింఛన్‌దారులకు శుభవార్త! నేటి నుంచి రెండు నిబంధనలను ఐఆర్‌డీఏఐ సరళీకరించింది. యూజర్లకు ఇబ్బంది కలగకుండా వాటిని సులభతరం చేసింది. ఇకపై ఆన్యూటీ ప్లాన్‌ను ఎంపిక చేసుకొనేందుకు ప్రత్యేకంగా ప్రతిపాదన పత్రాన్ని నింపాల్సిన అవసరం లేదు. అదే విధంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు అంగీకరించింది. ఈ మేరకు బీమా నియంత్రణ సంస్థ రెండు ఉత్తర్వులు జారీ చేసింది.
'ఎన్‌పీఎస్ విరమణదారులు సమర్పించే ఎగ్జిట్ ఫామ్‌నే ఇకపై ప్రతిపాదన పత్రంగా పరిగణనలోకి తీసుకుంటాం. దానిని అనుసరించే బీమా కంపెనీలు ఆన్యూటీ సాధనాలను ఆఫర్ చేస్తాయి' అని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ (IRDAI) సెప్టెంబర్ 13న ఉత్తర్వులు ఇచ్చింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సబ్మిట్ చేసేందుకు అనుమతించింది.
ఇప్పటి వరకు విత్‌డ్రావల్ సమయంలో పీఎఫ్‌ఆర్డీఏ (PFRDA)కు ఎన్‌పీఎస్ పెన్షనర్లు ఎగ్జాస్టివ్ ఎగ్జిట్ ఫామ్‌ను సమర్పించాల్సి వచ్చేది. ఆ తర్వాత బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఆన్యూటీ ప్రణాళికలను ఎంపిక చేసుకొనేందుకు ప్రతిపాదన పత్రాన్ని నింపాల్సి వచ్చేది.
'ఎన్‌పీఎస్ విరమణదారుల నుంచి పీఎఫ్‌ఆర్డీఏ సేకరిస్తున్న ఎగ్జాస్టివ్ ఎగ్జిట్ ఫామ్, బీమా కంపెనీలకు అవసరమైన ప్రతిపాదన పత్రంలోనూ ఒకే సమాచారం ఉందని మేం గమనించాం. డుప్లికేషన్ అవుతుండటాన్ని పరిశీలించాం. దాంతో ఎన్‌పీఎస్ రిటైరీస్ సులభంగా ఆన్యూటీ ఉత్పత్తులను ఎంపిక చేసుకొనేలా నిబంధనలు మారుస్తున్నాం. ఇందుకోసం పరిశ్రమ వర్గాలతో ఇప్పటికే చర్చించాం' అని ఐఆర్‌డీఏఐ తెలిపింది.
ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ ముగిశాక యూజర్లు జమ చేసిన కార్పస్‌లో 40 శాతం ఆన్యూటీ ప్రణాళిక కోసం వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం డబ్బును ఏక మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మొత్తం కార్పస్ రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువుంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 60 ఏళ్ల కన్నా ముందే పథకం నుంచి విరమించుకోవాలంటే కార్పస్‌లో 80 శాతం డబ్బుతో పెన్షన్ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
NPS Balance Check: వృత్తి జీవితం ముగిశాక ఆనందంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పింఛను పథకం (NPS) తీసుకొచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత నిలకడగా పింఛను పొందలేని వారికి రక్షణగా దీనిని ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చేరేందుకు అందరూ అర్హులే. ఏడాదికి కనీసం రూ.1000 కంట్రిబ్యూషన్ చేస్తే చాలు.
నేషనల్ పెన్షన్ స్కీమ్ ఖాతాలోని బ్యాలెన్స్ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఖాతాలో మీరెంత నగదు జమ చేశారన్నది మొదటిది. యాన్యుటీలో మీరు 40 శాతం మెచ్యూరిటీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. దాన్నుంచి వచ్చిన ఆదాయం రెండోది. ఈ పథకంలో జమ చేసిన డబ్బును చూసుకోవడం చాలా తేలిక.
ఇంటికే స్టేట్‌మెంట్
సాధారణంగా ఎన్‌పీఎస్ ఖాతా లావాదేవీల స్టేట్‌మెంట్‌ను సంబంధిత సీఆర్‌ఏ ఏటా మీ నమోదిత అడ్రస్‌కు పంపిస్తారు. అలాగే నెలకో, మూడు నెలలకో మీ ఈమెయిల్ ఐడీకి సాఫ్ట్ కాపీ వస్తుంది. మరీ అవసరం అనుకుంటే ఆన్‌లైన్‌లోనూ ట్రాన్జాక్షన్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే సీఆర్‌ఏ, ఎన్‌పీఎస్ మొబైల్ యాప్ వెబ్‌సైట్, ఉమాంగ్, ఎస్‌ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్ (SMS)
మిస్డ్ కాల్‌తోనూ ఎన్‌పీఎస్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకు ఎన్‌పీఎస్‌లో నమోదు చేసిన మొబైల్ నుంచి 9212993399 నంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే మీ ఖాతా వివరాలతో కూడిన సందేశం వస్తుంది. ఏమైనా సందేహాలు ఉంటే కస్టమర్ సర్వీస్ 022-24993499కు కాల్ చేయొచ్చు.