Breaking News: విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 05 Sep 2021 08:20 PM
బ్యూటీ సెలూన్‌ ముసుగులో వ్యభిచారం..

స్పా సెంటర్‌, బ్యూటీ సెలూన్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు సహా ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, పది మంది యువతులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.73000 నగదు, ఓ కారు, 28 మొబైల్‌ ఫోన్లు, రూ.4 లక్షలు బ్యాలెన్స్‌ ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టు..

విజయవాడలో గోల్డ్ మాఫియా గుట్టురట్టయింది. సౌదీ నుంచి సింగపూర్ మీదుగా నగరానికి అక్రమంగా బంగారం తెస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతోన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు రూ.5 లక్షలు విలువ గల బంగారం బిస్కెట్లను కస్టమర్లకు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నగదు చెల్లించిన 30 రోజుల్లో బంగారం డెలివరీ చేస్తామని కస్టమర్లకు మాయమాటలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. 2018 నుంచి ఈ దందా కొనసాగుతోందని వెల్లడించారు. 


ఇటీవల బాధితుల నుంచి దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత 4 నెలల నుంచి బంగారం డెలివరీకి బ్రేక్ పడడంతో వివాదం తెరపైకి వచ్చింది. ముందస్తు ఆర్డర్లు ఇచ్చిన కొందరు గొడవకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. 


రైల్వే ఉద్యోగి పాత్ర కీలకం.. 
బంగారం స్మగ్లింగ్‌లో రైల్వే ఉద్యోగితో పాటు ఓ మహిళ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బంగారం బిస్కెట్ల కోసం రైల్వే, దుర్గ గుడి ఉద్యోగులు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. బంగారం కోసం ఇచ్చిన నగదు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాలేదని తెలుస్తోంది. 

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. ఏపీలో ఘోరం..

కుటుంబ కలహాలతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిందో భార్య. ఈ దారుణ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన విశ్వనాధపల్లి అప్పారావుని అతని భార్య విశ్వనాధపల్లి దేవి గొడ్డలితో నరికి చంపింది. హత్య చేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. అనుమానంతో తనను రోజూ వేధిస్తున్నాడని, విసుగు చెంది చంపేసినట్లు దేవి.. పోలీసులకు వెల్లడించింది. ఘటనా స్థలాన్ని డీఎస్ పీ భీమారావు, సీఐ ఆకుల మురళీ కృష్ణ పరిశీలించారు. 

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా రొద్దం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రామకృష్ణ (38), కుళ్లాయప్ప (41)గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రొద్దం గ్రామానికి చెందిన ముగ్గురు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మద్యంలోనే కుళ్లాయప్ప, రామకృష్ణ మృతి చెందారు. లక్ష్మన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముగ్గురు ఉదయం కర్ణాటకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 

అక్రమ వసూళ్లకు పాల్పడుతోన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..

అక్ర‌మ వసూళ్ల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు కానిస్టేబుళ్లపై నెల్లూరు ఎస్పీ వేటు వేశారు. నెల్లూరులోని ప‌ప్పుల‌ వీధిలో వ్యాపారుల నుంచి అక్రమ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న ఇద్ద‌రు కానిస్టేబుళ్లపై చ‌ర్య‌లు తీసుకున్నారు. న‌వాబుపేట పోలీస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు కానిస్టేబుల్స్ ఇటీవల వ్యాపారుల‌ నుంచి డ‌బ్బులు తీసుకుంటుండ‌గా కొంద‌రు వీడియో తీసి వాట్సాప్‌లో పోస్టు చేశారు. అది కాస్త వైర‌ల్‌ అయింది. దీనిపై విచార‌ణ చేపట్టిన ఎస్పీ వారిద్ద‌రిపై వేటు వేస్తూ (వీఆర్) ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

కదిరిలో ఎం.బి.బి.ఎస్ విద్యార్థిని ఆత్మహత్య 

అనంతపురం జిల్లా కదిరి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న ఉపాధ్యాయ దంపతుల కుమార్తె ఎంబిబిఎస్ విద్యార్థిని రాఫీయా అంజూమ్ (21) ఆత్మహత్య చేసుకుంది. తమ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కదిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న జైనులాబ్దిన్, మహబూబ్ చాంద్ లు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
వీరి పెద్ద కుమార్తె రాఫీయా అంజూమ్ తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నది. తండ్రి అనారోగ్యం వల్ల నెల రోజుల కిందట ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం తల్లి విధులకు వెళ్లగా ఆమె సోదరి పాఠశాలకు వెళ్ళింది. తండ్రికి అవసరమైన మందులు ఇచ్చి మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని సాయంకాలం వరకు తెరవక పోయేసరికి ఇరుగుపొరుగువారి సహాయంతో తలుపులు తీయడం జరిగిందని తెలిపారు. అప్పటికే  ఫ్యాన్ కు వేలాడుతూ ఉన్నట్టు చూసి పోలీసులకు సమచారం అందించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులకు తెలిపారు. 

అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల 17న ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు సమాచారం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నిర్మల్‌లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది.

రైతును మించిన గురువు లేడు : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతర్రాష్ట్ర అరటి మార్కెట్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. అరటి రైతులను మాట్లాడిన ఆయన వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనారాయణను చూసి రైతు నాయకుడంటూ రైతులు నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతును మించిన గురువు లేడని లక్ష్మీనారాయణ అన్నారు. తాను12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నాని తెలిపారు. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు, ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు.  రైతులకు ఉచిత విద్యుత్ 12 గంటలకు పెంచాలని, ఉపాధి హామీ పథకం ద్వారా యాభై శాతం కూలీలు రైతుల పొలాల్లో పనిచేయాలని సూచించారు. అరటి రైతుల ఆదాయం పెరిగే మార్గాలను ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్తానని ఆయన తెలపారు. 

ఈ నెల 16న ఏపీ కేబినేట్ భేటీ

ఈ నెల 16న ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు సాధారణ పరిపాలన శాఖకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు

ఈ నెల 16న ఏపీ కేబినేట్ భేటీ

ఈ నెల 16న ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు సాధారణ పరిపాలన శాఖకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు

ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా సీఎం నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి జగన్‌ ​నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రారామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


‘చదువే తరగని ఆస్తి, గురువే రూపశిల్పి, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్‌ డే శుభాకాంక్షలు’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 


 





కొండవాగులో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కొండ మొదలు పంచాయతీ బడిగుంట గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం కొండవాగు దాటుతూ  గల్లంతైన ఇద్దరు చిన్నారులు సహా మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆధార్ కార్డ్ అప్ డేట్ కోసం రంపచోడవరం వెళ్లి వస్తుండగా శనివారం వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. వర్షాల కారణంగా ఆకూరు-బడిగుంట గ్రామాల మధ్య కొండ వాగు దాటుతూ పొడియం గణేష్ దొర (5), వెట్టి వంశీ దొర (5), వెట్టి జ్యోతి (30) గల్లంతయ్యారు. 

ఆర్మీ జవాను మిస్సింగ్

కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన జవాన్  నవీన్ కుమార్ (28) కనిపించడం లేదు. గత నెల ఆగస్టు 4న జోధ్‌పూర్ నుంచి సెలవుపై స్వగ్రామం వచ్చిన ఈయన గత నెల 29న అర్ధరాత్రి కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అప్పటి నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్మీ అధికారులకు ఫోన్ చేయగా.. జోధ్‌పూర్‌కు రాలేదని చెప్పారు. దీంతో నవీన్ కుమార్ తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాడిపత్రిలో వైసీపీ నేత దారుణ హత్య...

అనంతపురం జిల్లా తాడిపత్రి శివారులోని గన్నేవారి పల్లె మాజీ ప్రెసిడెంట్ పోతులయ్య  దారుణ హత్య గురయ్యారు. చుక్కలురు కొత్త బ్రిడ్జి వద్ద పొలంలో పోతులయ్య మర్మాంగం కోసి హత్యచేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. 

నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపై వైద్యుడు, మహిళ కొట్లాట

నెల్లూరు నగరంలో  హోమియోపతి వైద్యుడి వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. వైద్యుడు, అతని వద్ద పనిచేస్తున్న మహిళ పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఈ విషయంపై ఓ మహిళ, వ్యక్తి నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి బాధిత మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరుకు చెందిన హోమియోపతి డాక్టర్‌ బాల కోటేశ్వరరావు, మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆ వైద్యుడు మహిళను దూరం పెడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలో డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళ పరస్పర దాడి చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబిత

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని టీచర్లందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఉపాధ్యాయులందరికీ మార్గదర్శకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసేది గురువులేనని వారి సేవలను సబితా కొనియాడారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సందర్శన

భారీగా కురిసిన వానతో మహబూబ్‌నగర్‌ నీటమునిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పెద్ద చెరువు కింద లోతట్టు ప్రాంతాలైన రామయ్య బౌలి, క్రిస్టియన్ పల్లి, లక్ష్మీ నగర్, శివశక్తి నగర్, బికే రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదివారం నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు.









పారాలింపిక్స్ లో భారత్​కు మరో పతకం... బ్యాడ్మింటన్ లో యతిరాజ్ కు సిల్వర్ మెడల్

టోక్యో పారాలింపిక్స్​లో భారత్ కు మరో పతకం దక్కింది. బ్యాడ్మింటన్ ఎస్.ఎల్​4 విభాగం ఫైనల్లో సుహాస్ యతిరాజు 1-2 తేడాతో ఓడి సిల్వర్ మెడల్ చేసుకున్నాడు. ఫ్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ బంగారు పతకం గెల్చుకున్నాడు. 

Background

కన్న కూతురితో పాటు కుమార్తె వరసయ్యే మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిశ డీఎస్పీ మురళీమోహన్‌ తెలిపిన వివరాలు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో వరసకు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై ఆగస్టు 15న ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు విషయం తెలిసింది. వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తులో ఆగస్టు 21న తన ఆరేళ్ల సొంత కూతురిపైనా అఘాయిత్యం చేసినట్లు ఒప్పుకున్నాడు. 


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.