Breaking News: ప్రధానమంత్రితో సీఎం కేసీఆర్ భేటీ.. తెలుగు రాష్ట్రాల జలవివాదంపై చర్చ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రా మధ్య నెలకొన్న జలవివాదాలపై చర్చించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల అంశంపై మెమొరాండం ఇచ్చినట్టు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డు విడుదల చేసిన గెజిట్‌పై తమ అభ్యంతరాన్ని ప్రధానికి కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది.
కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా సంస్థల పున:ప్రారంభంపై శుక్రవారం సీఎస్ సోమేశ్ సమీక్ష చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి వంద శాతం టీకాలు వేయించాలని అధికారులను ఆదేశించారు. టీకాలు వేయించుకున్నట్లు పాఠశాలల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాక విద్యాసంస్థలను ప్రతిరోజూ శుభ్రపరచాలని కూడా సీఎస్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీ ఈవో కుసుమ కుమారితో పాటుగా స్థానిక అధికార పార్టీ నేతలు తమని వేధిస్తున్నారని వాలంటీర్లు ఇవాళ పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లలను వేధిస్తున్న గ్రామ పంచాయతీ ఈవో కుసుమ కుమారినీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక పార్టీ నాయకులు వేధింపులు మానుకోవాలని, లేకపోతే తామంతా ఆత్మహత్యకు సిద్దమన్నారు.
పాకాల గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కామని, అందుకే 74 మంది రాజీనామా చేస్తున్నామని వాలంటరీలు తెలిపారు. అంతే కాకుండా ఈవో మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మానసికంగా మమ్మల్ని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలలో తమ వారికి ఇళ్ల స్థలాలు వచ్చేలా చూడాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటరీలపై స్థానిక రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు.
ఈడీ కార్యాలయంలో విచారణలో ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. అధికారులు ఏర్పాటు చేయించిన భోజనాన్ని నిరాకరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి లంచ్ తెప్పించుకొని తిన్నారు. అనంతరం తిరిగి విచారణలో రకుల్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 11 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. 8 రోజుల్లో 200కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,889 మ్యూకర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 463 మందికి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3 కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రకాశం జిల్లాలో రెండు, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. వారం రోజుల వ్యవధిలో బ్లాక్ ఫంగస్ కారణంగా 12 మంది మృతి చెందారని దీంతో మ్యూకర్ మైకోసిస్ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 448 మంది మరణించినట్టు తెలియజేసింది.
గతంలో అగ్రిమెంట్లు కాగితాలకే పరిమితం అయ్యేవని సీఎం జగన్ అన్నారు. చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం చేస్తున్నామన్నారు. అభివృద్ది జరగకపోయినా హడావుడి ఎక్కువగా ఉండేదని విమర్శించారు. బులెట్ ట్రైన్, ఎయిర్ బస్ రాకపోయినా... వచ్చేసినట్లు పేపర్లో వార్తలు వచ్చేవని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంతో గత ఏడాది మే 22న రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు.
కడప జిల్లా పులివెందుల మండలం మొట్నూతల, కనంపల్లె గ్రామాల్ని వరద ముంచెత్తింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓడలపల్లె వద్ద చెరువు కట్ట తెగిపోయింది. చెరువు నీరంతా పులివెందుల మండలం మొట్నూతలపల్లి గ్రామానికి పోటెత్తింది. గ్రామాల్లోని అరటి, నిమ్మ, కూరగాయల పంటలు నీట మునిగాయి. మొట్నూతల పల్లె గ్రామంలో దాదాపు 20 పశువులు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో శుక్రవారం సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకుముందు ఆయన సైబరాబాద్ సీపీగా పని చేసిన సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లా తలుపుల మండలం వొదులపల్లి వద్ద తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షంతో వంతెన కూలిపోయింది. ఈ. ప్రమాదంలో ఓ కారు నీటిలో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు మృతి, మరొకరు గల్లంతు అయినట్లు సమాచారం
కడప జిల్లా మైదుకూరు మండలం బసాపురం గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు దంపతులు హత్యకు గురయ్యారు. వేముల నాగయ్య - నాగమ్మ శుక్రవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నోటి దురుసుతో వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలేదని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తహసీల్దార్ లను యూజ్ లెస్ ఫేలోస్ అని నోరుజారారు. పలువు తహసీల్దార్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ను కలిశారు. ఒకే కుటుంబంలా భావించి వ్యాఖ్యలు చేసినట్లు కలెక్టర్ అన్నారు. పలు చోట్ల కలెక్టర్ కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆడియో వైరల్ అయ్యింది.
ఈడీ అధికారులు ఇంకా కార్యాలయానికి చేరుకోకముందే రకుల్ ప్రీత్ సింగ్ ఆఫీసుకు వచ్చారు. రకుల్ వెంట ఆమె మేనేజర్ మాత్రమే ఉన్నారు. ఈడీ కార్యాలయంలోని జాయింట్ డైరెక్టర్ గది పక్కనే ఉన్న వెయిటింగ్ హాలులో రకుల్ వేచి చూస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. మూడో రోజు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా రకుల్ ఇప్పుడే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న నటి, నిర్మాత ఛార్మి.. మొన్న పూరీ జగన్నాథ్‌లను ఈడీ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా గన్నవరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయ పారిమిల్స్ లో మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుంది.
Background
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగాం మండలం లట్టిగాం వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పలాస మండలం చిన్నబడాం వాసులుగా గుర్తించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -