Revenue meetings in Andhra Pradesh from September 1 says Minister Mandipalli Ramprasad| మంగళగిరి: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కు వచ్చే వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి, గ్రామాల్లోనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో శాసనమండలి మాజీ చైర్మన్ M.A షరీఫ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, శ్రీరాం చిన్నబాబులతో గ్రీవెన్స్  నిర్వహించారు. 


అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన భూ దోపిడీలు, రికార్డుల తారుమారు, ఆన్ లైన్ ట్యాంపరింగ్ లాంటి సమస్యలను గ్రామాల్లోకి వచ్చే అధికారులకు ప్రజలు తెలియజేయాలి. వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు అధికారులు గ్రామాల్లోనే ఉండి బాధితుల నుంచి విన్నపాలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తాం. వచ్చే ఐదేళ్లలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేయనుందని’ తెలిపారు.  

   


మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల అక్రమాలు
మదనపల్లిలో తమ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఆక్రమించి అక్రమంగా ఇళ్లు కట్టారని, అన్నమయ్య జిల్లా రాయచోటి జేసికి ఫిర్యాదు చేసినట్లు రిటైర్డ్ టీచర్ జి. మురళీ గ్రీవెన్స్ లో వాపోయాడు. ఈ భూ ఆక్రమణపై విచారించి కబ్జాకు సహకరించిన తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కు స్పందనలో అర్జీ ఇచ్చామని తెలిపాడు.    


పశ్చిమ గోదావరి జిల్లా విప్పారు గ్రామానికి చెందిన గుడి మెట్ల కోటయ్య తన భూమిని బ్లాక్ లో పెట్టడంతో రిజిస్టర్ అవడం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.  సంబంధిత దేవాదాయశాఖ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఓ బ్యాంకు ఖాతాకు వచ్చిన వందల కోట్ల నిధులు అలాగే ఉన్నాయని, దాన్ని పీడీ ఖాతాకు మళ్లించి గ్రామాలో అభివృద్ధి పనులకు వినియోగించాలని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి గ్రీవెన్స్ లో కోరాడు. 


తనకు ఐసెట్‌లో 8,239 ర్యాంక్ వచ్చిందని, కాలేజీ వాళ్లు సీటుకోసం రూ. 80 వేలు ఫీజు అడుగుతున్నారు. తన తండ్రి డ్రైవర్ గా చేస్తున్నాడని, డబ్బులు కట్టే ఆర్థిక స్థోమత లేక చదువు ఆగిపోతుందని ఓ విద్యార్థిని రూపశ్రీ చెప్పగా.. ఆమెకు మంత్రి రూ. 20,000 ఆర్థిక సాయం చేశారు. గిద్దలూరుకు చెందిన  ఓ వృద్ధుడు తన భూ సమస్యపై మంత్రికి చెప్పగా, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. 


గత 20 ఏళ్లుగా సంఘమిత్రలుగా పనిచేస్తోన్న తమను నాయకులు తొలగించేందుకు ప్రయత్నిస్తోన్నారని కుప్పం నియోజకవర్గం గుదుపల్లె మండలానికి చెందిన సంఘమిత్రలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని అలాగే ఉంచి తమను తొలగించేందుకు యత్నిస్తోన్నారని.. మంగళగిరి గ్రీవెన్స్ లో వాపోయారు. 


Also Read: Andhra Pradesh: సినర్జిన్‌ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: మంత్రి అనిత