IRS Officer Jasthi Krishna Kishore Case: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై ఏపీ ప్రభుత్వం గతంలో నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు అక్రమమే అని న్యాయస్థానం తేల్చింది. EDB CEO గా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సీనియర్ ఐటీ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాడు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చెయ్యడమే కాకుండా క్రిమినల్ సెక్షన్ల కింద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే, తన సస్పెన్షన్ పై కృష్ణ కిషోర్ క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ను ఆశ్రయించగా, ఆ ఉత్తర్వులపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.


అనంతరం కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ జరిపిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కృష్ణ కిషోర్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్ లు చెల్లవని కేసును క్వాష్ చేసింది. 


కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభ పడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని తేల్చి చెప్పింది. అంతే కాకుండా సీఎం జగన్ పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా కృష్ణ కిషోర్ పై కేసు పెట్టినట్లు హైకోర్టు నిర్థారణకు వచ్చింది. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేయదగినదిగా హైకోర్టు భావించింది.


కృష్ణ కిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్ లో పని చేసిన సమయంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు ఇచ్చారు. దాన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధింపుగా అధికారంలోకి వచ్చిన తనను తరువాత సస్పెండ్ చేసి తప్పుడు కేసులు బనాయించినట్లుగా తన పిటిషన్ లో కృష్ణ కిషోర్ వివరించారు.


Also Read: గొడ్డళ్ళతో దాడి చేస్తుంటే వాళ్లు నిద్రపోతున్నారా? జగన్ ఆదేశాలిచ్చారా? పల్నాడు ఘటనపై చంద్రబాబు ధ్వజం