Chaman Son: దివంగత నేత మాజీ జడ్పీ ఛైర్మన్ చమన్ సాబ్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలి  ఇప్పుడు జిల్లాలో కొత్త చర్చకు దారి తీసింది. పరిటాల రవికి అత్యంత ప్రధానమైన అనుచరుల్లో చమన్ సాబ్ ఒకరు. అయితే ఆయన కుమారుడు ఉమర్ సాబ్..  ప్రస్తుతం వైసీపీ నాయకులతో కలిసి ఉన్న ఫోటోలు బయటికి రావడంతో కొత్త చర్చ మొదలైంది. రాజకీయ వర్గాలకు ఇది హాట్ టాపిక్ గా మారింది. కొన్ని దశాబ్దాలుగా పరిటాల రవికి కుడి భుజంగా ఉంటూ అనేక కార్యకలాపాల్లో చమన్ భాగం అయ్యారు. 


పదేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన చమన్ సాబ్..


తెలుగు దేశం ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ కు అధికారం మారిపోవడంతో చమన్ సాబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల రవి హత్య సంఘటనలతో జిల్లా అట్టుడికింది. పదేళ్ల అనంతరం తేదేపా ప్రభుత్వము అధికారంలోకి రావడంతో పరిటాల సునీతకు మంత్రి పదవి దక్కింది. దీంతో జిల్లాకు రావడం మంచిదే అని భావించిన చమన్ అజ్ఞాతం వీడి జిల్లాకు చేరుకున్నారు. పరిటాల కుటుంబం చమన్ ను ఆదరించి జడ్పీ ఛైర్మన్ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. తదనంతరం ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. అయితే చమన్ కుటుంబీకులు పరిటాల కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉంటారని  అందరూ భావించారు.


తండ్రి తెదేపా, కుమారుడు వైసీపీ నాయకులతో..


కానీ ఈ మధ్య కాలంలో చమన్ కుమారుడు  వైసీపీ నాయకురాలు, ప్రస్తుత జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల వైసీపీ నాయకుడు పాలమల్లికి చెందిన తోటలో ఓ పూజా కార్యక్రమంలో చమన్ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, ప్రధాన నాయకులతో పరిచయాలు చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాల నుంచి తండ్రి పరిటాల కుటుంబానికి మద్దతుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన కుమారుడు వైసీపీ వర్గంకు చెందిన నాయకులతో ఉండడమేంటన్న చర్చ జోరందుకుంది. 


తండ్రికి తెదేపాలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లేనా..


జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎంపీ  టికెట్టు గాని కావాలని చమన్ ఆశించినట్లు  అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అంశమే పరిటాల కుటుంబంతో చమన్ దూరంగా ఉండడానికి కారణంగా కొంత మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా చమన్ కుమారుడు ఉమర్, చమన్ భార్య వారికి దగ్గరగా ఉన్న వాళ్లతో వ్యాఖ్యానించినట్టు కూడా బోగట్టా. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులతో చమన్ కుమారుడు ఉండడంతో ఇక బహిరంగంగానే పరిటాల కుటుంబానికి చమన్ కుటుంబీకులు గుడ్ బై చెప్పినట్లు పలువురు రాజకీయ నాయకులు భావిస్తున్నారు.


అయితే చమన్ కుటుంబ సభ్యులు నిజంగానే పరిటాల కుటుంబానికి దూరం అయ్యారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. చమన్ కుమారుడు ఉమర్ వైసీపీ నాయకులతో తిరగజంపై పరిటాల సునీత కానీ పరిటాల శ్రీరామ్ కానీ స్పందిస్తారో లేదో చాడాలి.