పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై గ్రామంలో వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసిన ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ హత్యాయత్నాన్ని వైసీపీ రౌడీలు చేసిన పనిగా ఆయన ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, అందుకే పోలీసులు చూసీ చూడనట్లుగా మిన్నకుండిపోయారని విమర్శించారు.


‘‘పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? 


తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారు. పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. 


తెలుగుదేశం వైపు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి.’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.










పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ప్రత్యర్థులు ఆయనపై గొడ్డళ్లతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన వెన్న బాల కోటిరెడ్డి ప్రస్తుతం రొంపిచర్ల మండలం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.


నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబు నరసరావుపేట ఆసుపత్రికి వెళ్లి బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలకోటిరెడ్డిపై వైసీపీ రౌడీ ల దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ కార్యకర్తలు.. మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారంటూ మండిపడ్డారు. సామాన్యుల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఇదే వైసీపీ ప్రభుత్వం అన్నారు.