Actor Sayaji Shinde met Pawan Kalyan in Mangalagiri office | మంగళగిరి: సినీ నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ ను కలిస్తే ఓ మంచి విషయం సూచిస్తానని చెప్పిన షాయాజీ షిండే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా ఇవ్వడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అని పవన్ కు షాయాజీ షిండే సలహా ఇచ్చారు. దీనిపై ఏపీ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆలయంలో ప్రసాదంతో పాటు భక్తులకు ఓ మొక్క ఇవ్వాలన్న షాయాజీ షిండే సూచనను స్వాగతించారు. ఇది చాలా గొప్ప ఆలోచన అని అభినందించారు. ఈ సూచన అమలు చేయడంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.




మహారాష్ట్రలో అమలవుతోందని సలహా
ఏపీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆలయాలపై, ప్రకృతిని కాపాడటంపై తన ఆలోచనలు పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు. వృక్ష ప్రసాద్ యోజన మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. అక్కడ 3 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతో పాటు మొక్కలు ఇస్తున్నారని తెలిపారు. మొక్కలు, వాటి విశిష్టతపై మరాఠీలో షాయాజీ షిండే తాను రాసిన కవితను పవన్ కళ్యాణ్ గారికి చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్ ప్రశంసించడంతో పాటు తెలుగులో అనువదించి చెప్పారు. పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో మరాఠీలోనే మాట్లాడతారని కొందరికే తెలుసు. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ఓ సందర్భంలో తెలిపారు.



పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం షాయాజీ షిండే మాట్లాడుతూ ‘ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై . మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు అని చెబుతోంది. తరువాత తరాలకు మంచి ఆరోగ్యకరమైన పర్యావరణం అందించాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు మొక్కల విశిష్టతను చెప్పాలి. దీని కోసం ఆలయాలకు వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు ఓ మొక్కను ఇచ్చి, అది పెంచేలా ప్రోత్సహించాలి. 


Also Read: Nagarjuna News: కొండా సురేఖకు క్రిమినల్ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చేది ఎప్పుడంటే!


మహారాష్ట్రలో మూడు ముఖ్యమైన ఆలయాలు సిద్ధి వినాయక టెంపుల్, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజనగా చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొక్కలను నాటడం నా జీవన విధానంలో ఓ భాగం అయ్యింది. మా అమ్మ చనిపోయిన సమయంలో ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చెట్లు అవ్వాలన్న మంచి ఆశయంతో చాలా ప్రాంతాల్లో నాటాను. అదే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకున్నారు. ఇకనుంచి భక్తులకు ఆలయంలో ప్రసాదాలతోపాటు దేవుడు ఇచ్చిన బహుమతిగా ఓ మొక్కను అందిస్తే వాటిని నాటతారు. ఇలా మొక్కల్ని నాటడం, వాటిని సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారు. దాంతో ఆధ్యాత్మికతతో పాటు మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తే భావి తరాలకు అవి మేలు చేస్తాయని’ అన్నారు.