Palle Panduga program to be start on 14 october says AP Deputy CM Pawan Kalyan | అమరావతి: ఇటీవల ఒకేసారి వేల సంఖ్యలో గ్రామసభలు నిర్వహించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో గ్రామాల్లో అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం చేపట్టి, గ్రామాల్లో పనులకు శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నామన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులు ఏపీకి మంజూరు చేసినట్లు తెలిపారు.  


పల్లె పండుగతో వేల పనులకు శ్రీకారం


ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం ఉదయం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు, డిపిఓ లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర అధికారులకి దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగలో అధికారులతో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.


వారం రోజులపాటు ఏపీ వ్యాప్తంగా పనులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఇటీవల మనం గ్రామ సభలు నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమంలో కొన్ని పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా పల్లె పండుగ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ 14 నుంచి దాదాపు వారం రోజులపాటు పల్లె పండుగ మనం నిర్వహిస్తున్నాము. ఆగస్టులో జరిగిన గ్రామసభల్లో తీసుకున్న దరఖాస్తుల పరిష్కారానికి, తీర్మానాలను అమలుకు దాదాపు 4500 కోట్ల వ్యయంతో 30 వేల పనులకు పల్లె పండుగ ద్వారా శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాలతో పనులు మొదలుపెట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయాలి. మరో 500 కిలోమీటర్ల మేర తారు రోడ్లు వేయాలి. ఇంకుడు గుంతల నిర్మాణాలు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు లాంటి పనులు చేపట్టాలని’ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు వివరించారు.


Also Read: Haryana Assembly Election Results 2024 : హర్యానా గేమ్‌ ఛేంజర్ పవన్ కల్యాణ్- సోషల్ మీడియాలో పోస్టులు వైరల్