Minor Abused By A Man In Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో (Pithapuram) దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించి అత్యాచారం చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం స్టువర్టుపేటలో నడిచి వెళ్తోన్న బాలికను.. ఓ వ్యక్తి, మరో మహిళ ఓ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. ఆమె అడ్రస్ చెబుతుండగా.. మత్తు మందు స్ప్రే చేసి ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం పిఠాపురం శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికకు బలవంతంగా మద్యం తాగించి సదరు వ్యక్తి ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.
దీంతో బాలికను ఆటోలో ఎక్కించేందుకు వారు ప్రయత్నిస్తుండగా.. గమనించిన ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ అనుమానంతో వారిని ప్రశ్నించింది. బాలిక ముఖం గుర్తు పట్టి వారి బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ పట్టుకున్నారు. బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికను కిడ్నాప్ చేసి మద్యం తాగించి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఓ పార్టీ నాయకురాలి భర్త అని తెలుస్తోంది.
'బాలికపై అఘాయిత్యం అమానుషం'
అటు, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో స్థానికులు స్పందించి నిందితున్ని పట్టి పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని.. లేదంటే నిందితుడు తప్పించుకునేందుకు ఆస్కారం కలిగేదని అన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 'ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బాలికను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించాను. ప్రభుత్వ పరంగా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులు అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక జనసేన నాయకులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఆదేశించాను.' అని పవన్ పేర్కొన్నారు.
Also Read: Andhra University: అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్