Haryana Assembly Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం అక్కడ బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం హర్యానాలోని 90 స్థానాల్లో బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌తో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సరికొత్త వాదన మొదలైంది. 


సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
RebelWooD అనే పేరుతో ఉన్న అకౌంట్‌ను పెట్టిన పోస్టు ప్రకారం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ గేమ్‌ఛేంజర్ అంటూ చెప్పుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్, ఈవీఎంల మధ్య వ్యత్యాసం పూర్తిగా పవన్ కళ్యాణ్ అంటు అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తర్వాత తన వాయిస్ తో హర్యానా ఎన్నికల స్వరూపాన్నే మార్చేశారని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా రాస్తూ, ఆయన మన సనాతన ధర్మ రక్షకుడని పేర్కొన్నారు. 






మరొక పోస్ట్‌లో హర్యానా, జమ్మూకశ్మీర్‌లో బిజెపి విజయం గురించి మాట్లాడారు. నిత్య రక్షకుడు పవన్ కళ్యాణ్ యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాడని తెలిపారు. హర్యానా ప్రచారం చేసి ఉంటే.. కచ్చితంగా బీజేపీ మరింత స్పష్టమైన మెజార్టీతో గెలిచేదని నెటిజన్ అభిప్రాయపడ్డారు. 


తిరుమల లడ్డూ వివాదం టు సనాతన బోర్డు 


తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో దీనిపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తాను దీక్ష చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పది రోజుల పాటు దీక్ష చేసిన పవన్ కల్యాణ్‌... అకస్మాత్తుగా హిందుత్వ అజెండాను ఎత్తుకున్నారు. హిందువులపై, హిందూ సంప్రదాయాలపై, గడులు గోపురాలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు సనాతన బోర్డు అవసరం అంటూ సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. 






పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన సనాతన బోర్డు ఏర్పాటుకు బీజేపీ నుంచి కూడా మద్దతు వచ్చింది. ఇదే హిందుత్వ వాదన హర్యానాలో హిందువులను ఏకం చేసిందని కొందరు జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్ వరకు కాంగ్రెస్‌కు పడినప్పటికీ తర్వాత ఏపీలో జరిగిన పరిణామాలు హర్యానాలో ప్రజల్లో ఆలోచింపజేసిందని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 


ఈ మధ్య కాలంలో తమిళనాడు అంశాలపై పవన్ కల్యాణ్ ఫోకస్ చేస్తుండటంతో అక్కడ కూడా కచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని వచ్చే ఎన్నికల్లో డీఎంకేకి ఒక్కస్థానానికే పరిమితం చేస్తారని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి హర్యాన ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని పవన్ కల్యాణ్‌కు గెలుపు క్రెడిట్ మాత్రం జనసేన అభిమానులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రత్యర్థులు ఆ స్థాయిలోనే సెటైర్లు కూడా వేస్తున్నారు. 


  Also Read: నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ