Nampally court records Supriya statement |హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయిందని నాగార్జున మేనకోడలు సుప్రియ కోర్టుకు తెలిపారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో నాగార్జున, అమల, నాగ చైతన్యలతో పాటు సుప్రియ విచారణకు హాజయ్యారు. అనంతరం సుప్రియ మాట్లాడుతూ.. మంత్రి మా ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ తరువాత నాకు చాలా మంది ఫోన్ చేసి మాట్లాడారు. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను జడ్జ్ ముందు చదివి వినిపించినట్లు సుప్రియ తెలిపారు.
సుప్రియ మాట్లాడుతూ.. ‘మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలపై కుటుంబసభ్యులం అంతా కలిసి చర్చించాము. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించింది. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమకు చెందిన వారిని టార్గెట్ చేసుకొని దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ కారణంగా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని మంత్రి మాట్లాడారు. N కన్వెన్షన్ విషయంలో కేటీఆర్ అడిగిన వాటికి ఒప్పుకున్నామని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖ వ్యాఖ్యలతో అక్కినేని ఫ్యామిలీ షాక్
కొండా సురేఖ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ అయింది. సమాజంలో ఎంతో పేరు, ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం మీద మహిళ అయి ఉండి మంత్రి ఎందుకలా మాట్లాడిందో అర్ధం కావడం లేదు. కానీ ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలతో మా కుటుంబసభ్యులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. కొండా సురేఖ మా ఫ్యామిలీ గురించి మాట్లాడిన వీడియోలను కోర్టుకు సమర్పించాము. ఇప్పటికీ కూడా ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. దాంతో మేం వ్యక్తిగతంగా, కుటుంబం పరంగా మా పరువుకు భంగం కలిగించాయని భావించి క్రిమినల్ డిఫమేషన్ కు వెళ్తున్నాం’ అని కోర్టులో వాదనల అనంతరం చెప్పుకొచ్చారు.
నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల ప్రకారం నాగార్జున విచారణకు హాజరై తన స్టేట్ మెంట్ ఇవ్వగా రికార్డు చేశారు. మొదటి సాక్షి అయిన సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసిందని, అక్టోబర్ 10న మరోసాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తారని తెలిపారు. దాంతో అదే రోజు కొండా సురేఖకు నోటీసులు జారీ చేయనున్నారు. తమ కుటుంబ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని నటుడు నాగార్జున కోర్టును కోరినట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు.