Tirumala Laddu Controversy News | న్యూఢిల్లీ: ఏపీలో ఆహార భద్రత పెంపొందించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నాణ్యత నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేయడానికి ఫుడ్ చెకింగ్ సంస్థ అంగీకరించింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి చివరికి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థను కాదని, సీబీఐతో దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.


భారీ ఖర్చుతో ల్యాబ్ ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం
గత ఐదేళ్లలో ఆహార భద్రత, ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకు దిగజారిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆహార భద్రత తనిఖీల కోసం లాబ్స్ ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకొచ్చింది. ఏపీలో 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలతో పాటు 15 మొబైల్ ల్యాబ్ లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఎఫ్ఎస్ఎష్ఏఐతో ఒప్పందం చేసుకుంది. ఒక్కో ల్యాబ్ కు రూ.21 కోట్లతో తిరుమల, కర్నూలులో ఆహార నాణ్యత పరీక్షల కోసం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇటు విశాఖలోనూ మైక్రో బయాలజీ ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.