Bhatti Vikramarka Comments On Job Notification: రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖలో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఆ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను ఇప్పటికే పూర్తి చేశామని.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. 'ఇటీవల వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టాం. వరదల సమయంలో శ్రమించిన విద్యుత్ సిబ్బందికి అభినందనలు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తాం. దసరా కంటే ముందుగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తాం.' అని భట్టి పేర్కొన్నారు.


'సిబ్బంది పొలంబాట పట్టాలి'






రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని.. రైతులకు సోలార్ సిస్టం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ అధికారుల పాత్ర చాలా కీలకమని.. విద్యుత్ సిబ్బంది, అధికారులు పొలం బాట పట్టాలని.. ఎక్కడా విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని నిర్దేశించారు. పొలాల్లో స్తంభాలు ఒరిగిపోకుండా చూడాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా మారాల్సి ఉంటుందని.. విద్యుత్ శాఖకు కూడా స్టాఫ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తోన్న మార్పులు ఆ కళాశాలలో నేర్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 


Also Read: KTR On Election Results : రాహుల్ వల్లే బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు