KTR :  కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలు అంటూ అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్, ఏడు గ్యారెంటీల పేరిట మభ్యపెట్టాలని చూసినప్పటికీ  హర్యానా ప్రజలు ఆ పార్టీకి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని కేటీఆర్ అన్నారు. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని దేశం మొత్తం గమనిస్తోందని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. అబద్ధపు హామీలతో అధికారం సాధించి ఆ తరువాత ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. 


కాంగ్రెస్ గ్యారంటీల గారడిని నమ్మలేదు !


ఒక్కో రాష్ట్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఒక్కో గ్యారెంటీ పెంచుకుంటూ గారడీ చేద్దామని చూసి.. కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు చిత్తుకాగితంతో సమానంగా మారిపోయిందని మండిపడ్డారు. ఏడు గ్యారంటీలు అంటూ తమ మోసాన్ని  విస్తరించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఘోరంగా  విఫలమైందన్నారు. అలవి కానీ హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రెస్ కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని చెప్పారు. హర్యానా ప్రజలిచ్చిన తీర్పుతో గ్యారంటీలకు ఇక వారెంటీ లేదన్నది స్పష్టంగా తేలిపోయిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైపోయిందని స్పష్టంచేశారు. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని, ఆయా రాష్ట్రాల్లో పాలనాపరమైన వైఫల్యాలు కాంగ్రెస్ ఓటమికి కారణమని వెల్లడించారు. సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో రాష్ట్రాలు వేరైనా ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. 


రాహుల్ బలహీన నాయకత్వం కూడా కారణం 


కాంగ్రెస్ తో హోరాహోరీ ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని, ఆ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ బలహీనమైన నాయకత్వం కూడా ఓ ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉన్నదనే విషయం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను చూస్తే అర్థమైపోతుందన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఫలితాలు కూడా రెండు జాతీయ పార్టీలకు ఏమాత్రం ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మొత్తంగా ఈ ఫలితాలను చూస్తుంటే 2029లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సాధారణ మెజార్టీ సాధ్యం కాదన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలే తదుపరి కేంద్రం ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు.  ఈ విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.  


2029లో  ప్రాంతీయ పార్టీలదే రాజ్యం 


హర్యానాలో కాంగ్రెస్ ఓటమితోనైనా రాహుల్ గాంధీ బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు. చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేనప్పుడు ఇలాంటి చెంపపెట్టులాంటి ఫలితాలు తప్పవన్నారు. బుల్డోజర్ రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాలకు హర్యానా ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ బుల్డోజర్ రాజ్ లు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా వ్యహహారాలు నడుస్తుంటే రాహుల్ గాంధీ చూసీ చూడనట్లు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందన్నారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా తాను చేసే పనులను ప్రజలు గుర్తించరని భావించటం రాహుల్ గాంధీ అమాయకత్వమన్నారు. రాహుల్ గాంధీ బలహీన నాయకత్వమే ప్రతిసారి బీజేపీకి వరంగా మారుతోందని చెప్పారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికైనా ఇచ్చిన గ్యారెంటీలు అమలుచేయకపోతే.. మున్ముందు కూడా కాంగ్రెస్ కు ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బలు తప్పవని కేటిఆర్ స్పష్టంచేశారు. గాలీలో దీపంలాంటి హామీలతో రూపొందించే గ్యారెంటీ కార్డులకు ప్రజాక్షేత్రంలో కాలం చెల్లిందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి, పది నెలలైనా ఒక్క గ్యారెంటీని గా సక్రమంగా అమలుచేయని కాంగ్రెస్ కు ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టడం ఖాయమని మండిపడ్డారు. తెలంగాణలో సంక్షేమ రంగాన్ని సమాధి చేసి.. పదేళ్ల ప్రగతికి పూర్తిగా పాతరేసిన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం వెంటాడటం తథ్యమని కేటిఆర్ హెచ్చరించారు.