AP Deputy CM Pawan Kalyan | మంగళగిరి: ఏపీలో పోలీసుల తీరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదివరకే సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సైతం పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో హెచ్చరించారు. అయినా కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు దారుణంగా ఉందని.. వారి తరఫున పవన్ కళ్యాణ్ బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. పవన్ కళ్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.


పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు


రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే, వారి తప్పులు తమ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని వ్యాఖ్యానించారు. ఇటీవల కాకినాడ జిల్లా తునిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రులతో పోలీసుల తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్నారు. 




మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్ ల కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని చలించిపోయారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయం పవన్ కళ్యాణ్ అందించారు. 



Also Read: AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం 


పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదన్న పవన్


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందడం ఎంతగానో బాధించింది. ప్రమాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వారి తల్లిదండ్రులు వెళ్లగా అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరు సరిగా లేదని నాకు తెలిసింది. కనీసం సమాధానం చెప్పకపోగా బాధితుల కుటుంబాలతో పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదు. రోడ్డు ప్రమాదంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అంత కష్ట సమయంలోనూ రేవంత్ బ్రెయిన్ డెడ్ అయితే... అతడి తల్లిదండ్రులు అవయవదానం చేయడం నన్ను కదిలించింది. పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై కేసు నమోదు చేయలేదని తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ సైతం బాధ్యతగా వ్యవహరించకపోవడం దారుణం’ అన్నారు. 




రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ సాయం అవసరం: పవన్ కళ్యాణ్ 
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని తక్షణ సాయం అందాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఘటనాస్థలంలో  ఉన్నవారిపై ఉంటుందని, కానీ మనం కేసుల భయాల నుంచి బయటకు రావాలన్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఈ విషయంపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సకాలంలో వైద్య చికిత్స చేయిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుందన్నారు.