AP Cabinet Special Meeting: ఈ నెల 11న ఏపీ కేబినెట్ (AP Cabinet) ప్రత్యేక భేటీ కానుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించనుంది. అనంతరం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు మంత్రి పయ్యావుల వివరించారు. అటు, ఏపీ శాసనసభ సమావేశాలు అదే రోజు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ నెల 11న ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలుత గవర్నర్ ప్రసంగం అనంతరం అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 10 రోజులు ఈ సమావేశాలు సాగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఈసారి సమావేశాల్లో సూపర్ సిక్స్ హామీల అమలు, నూతన మద్యం పాలసీ, ఉచిత ఇసుక సరఫరాపై చర్చ సాగే అవకాశం ఉంది. అలాగే, మరిన్ని కొత్త స్కీమ్‌ల అమలుపైనా సభలో కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, చివరి అసెంబ్లీ సమావేశాలు గత జులైలో 5 రోజుల పాటు సాగాయి.