AP CM Chandrababu Comments On Srisailam Development: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) శనివారం కీలక ప్రకటన చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని (Srisailam Temple) అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ సహా పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని.. వీటన్నింటి కోసం మంత్రులు ఆనం రామనారాయణ, కందుల దుర్గేశ్, జనార్దన్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకుని ఓ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకూ సీప్లేన్ ప్రారంభించిన ఆయన.. అదే ప్లేన్‌లో శ్రీశైలం వరకూ వచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అటవీ, దేవాదాయ, జిల్లా కలెక్టర్లు చర్చించి ఓ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని.. దీని ప్రకారం తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయం అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సున్నిపెంట ప్రాంతాన్ని సైతం నివాస యోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.










'వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం'


గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన భరోసా, మాపై పెట్టుకున్న నమ్మకంతో ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. 'అభివృద్ధి, సంక్షేమం టీడీపీకి రెండు కళ్లు. అభివృద్ధి చేస్తేనే సంపద పెరుగుతుంది. తద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ రోజు మనం కేంద్రంలో అధికారంలో లేకపోయి ఉంటే.. వాళ్లు కూడా సహకరించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి మనది. రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయి. నదుల అనుసంధానం చేసి గోదావరి, పెన్నా, వంశధార వరకూ కలపాలి. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భావిస్తున్నాం. పోలవరానికి గోదావరి నీటిని తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. ఇది జరిగితే గేమ్ ఛేంజర్ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ అవుతుంది. త్వరలోనే శుభవార్త చెబుతాను.' అంటూ సీఎం స్పష్టం చేశారు.


వారికి స్ట్రాంగ్ వార్నింగ్






95 సీఎం అంటే ఏంటో ఇంకా కొంతమందికి అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 'తల్లి, చెల్లి అంటే జగన్‌కు గౌరవం లేదు. మాకు సభ్యత, సంస్కారం ఉన్నాయి. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. నా దగ్గర రౌడీలు, గూండాల ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అసభ్యకర పోస్టులు పెడితే కఠినచర్యలు ఉంటాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలిపెట్టేది లేదు.' అంటూ వార్నింగ్ ఇచ్చారు.


Also Read: TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ