Seaplane Vijayawada To Srisailam: దేశంలోనే తొలిసారిగా సీప్లేన్ పర్యాటకం అందుబాటులోకి వచ్చింది. సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ‘సీ ప్లేన్’లో ప్రయాణించారు. ప్రకృతిని చూస్తూ జలమార్గం చేసే విహారం రాష్ట్ర పర్యాటక రంగానికి మరో ఆణిముత్యంగా చెప్పవచ్చు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
రాష్ట్ర పర్యాటక రంగానికి మరింతగా ఊపు తీసుకొచ్చేందుకు విమానయానశాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ఎగరనుంది. దాదాపు 150 కిలోమీటర్ల దూరాన్ని 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. అంతకు మించిన ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రకృతి అందాలు పర్యాటకులకు తెలియజేసేందుకు తక్కువ ఎత్తులో దీన్ని నడుపుతున్నారు.
విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లడానికి సీ ప్లేన్‌లో వెళ్లడానికి కేవలం 20 నిమిషాలే పడుతుంది. అయితే టేకాఫ్, ల్యాండింగ్ చేయడనికి మాత్రం మరో 10 నిమిషాల టైం తీసుకుంటారు. మొత్తంగా ఈ జర్ని 30 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు విజయవాడలోని పున్నమిఘాట్ లోని జలాల్లో టేకాఫ్ అయి శ్రీశైలంలో జలాల్లో ల్యాండ్ అవుతుంది. మళ్లీ అక్కడ టేకాఫ్ అయిన తర్వాత పున్నమిఘాట్‌లో ల్యాండ్ అవుతుంది. ఈ ప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్ కోసం నీటిపై ప్రత్యేకంగా జెట్టీలను సిద్ధం చేశారు.
సీ ప్లేన్ ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు, అధికారులు ఇందులోనే శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైలానికి చేరుకున్న తర్వాత అక్కడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని సందర్శించి తిరిగి అదే ప్లేన్‌లో విజయవాడ చేరుకుంటారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి సీప్లేన్ అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో కేంద్రం ఆలోచిస్తోంది. ముందుగా ప్రయోగాత్మకంగా ప్రకాశం బ్యారేజిలో మొదలు పెట్టారు. ఇక్కడ ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటిని సవరించి మరో ఏడు ప్రాంతాల్లో ఇలాంటి ప్లేన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్, అరకులోయ, లంబసింగి, రుషికొండ, కాకినాడ, కోనసీమ, శ్రీశైలం, గండికోట, తిరుపతి వంటి సుందరమైన ప్రదేశాలను కూడా కవర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. పర్యాటకులను ఆకర్షించడం, ఈ సుందరమైన ప్రదేశాలకు సులభంగా చేరుకునేలా ప్రయాణం సౌకర్యవంతం చేయాలని చూస్తోంది. హైదరాబాద్-శ్రీశైలం మార్గం సహా వివిధ ప్రాంతాలకు సీప్లేన్‌లను నడపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
సీప్లేన్‌లో ప్రయాణం చేయాలంటే టికెట్ రేటు ఎంత? (Seaplane Vijayawada To Srisailam Ticket Price)
విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య నడిచే సీప్లేన్ టికెట్ల రేట్లు ఇంకా నిర్ణయించలేదు. అందరికీ అందుబాటులో ఉండేలా ఆలోచన చేస్తున్నారు. దీని కోసం కేంద్రంతో రాష్ట్రం చర్చలు జరుపుతోంది. ఒకరి సీప్లేన్ ప్రారంభమైతే అందుకు అయ్యే ఖర్చులు, ఇతర విషయాలు బేరీజు వేసుకొని టికెట్లు ఖరారు చేయనున్నారు.
Also Read: విజయవాడ - శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ సక్సెస్ - పర్యాటక రంగంలో అద్భుతం, వీడియో చూశారా?