Srisailam Seaplane Trail Run Successfully: ఏపీ పర్యాటక రంగంలో మరో ముందడుగు పడింది. టూరిస్టులకు కొత్త అనుభూతిని పంచేలా సీప్లేన్ రెడీ సిద్ధమైంది. పర్యాటకులు నీటిలో దిగి గాలిలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే విజయవాడ - శ్రీశైలం 'సీ ప్లేన్' (Seaplane) ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. తొలుత విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 9న (శనివారం) పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) దీన్ని ప్రారంభిస్తారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఈ 14 సీట్ల సీ ప్లేన్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. పౌర విమానయాన శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా 'సీ ప్లేన్' ప్రయోగం చేపట్టాయి.
కాగా, ఇటీవలే జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌ను ఆడంబరంగా నిర్వహించగా పర్యాటక రంగంలో నూతన సాంకేతిక విప్లవంగా మారింది. ఇప్పుడు సీప్లేన్‌తో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే, దేశంలో నాలుగేళ్ల క్రితమే సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. గుజరాత్ నర్మదా జిదేల్లాలోని కేవడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. ఎక్కువ కాలం దీన్ని నడపలేకపోయారు. తాజాగా, పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో..
దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని ఎన్డీయే 3 ప్రభుత్వం భావిస్తోంది. పదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా వివిధ కారణాలతో మరుగున పడిపోయాయి. తాజాగా, పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ సర్వీసుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి సైతం సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం సహా ఫ్లైట్ కనెక్టివిటీని పెంపొందించేందుకు సీ ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న 3 నెలల్లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సీఎం షెడ్యూల్ ఇలా..
శ్రీశైలం జలాశయం నుంచి SLBC టన్నెల్ పరిసర జలాల్లో 'సీ ప్లేన్' ల్యాండ్ కానుంది. సీప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత చంద్రబాబు సీ ప్లేన్‌లో విజయవాడ వెళ్తారు. రాబోయే రోజుల్లో విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.
Also Read: Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ