Amaravati Smart City: అమరావతి స్మార్ట్ సిటీకి రూ. 930 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. స్మార్ట్ కింద ఎంపికైన అమరావతిలో రూ.930 కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. రూ.627.15 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయని, మరో రూ.302.86 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. తన వాటా కింద వచ్చే మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినందున.. తదుపరి కేటాయింపులకు ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ సమాధానం ఇచ్చారు. 


పూర్తయిన 12 ప్రాజెక్టులు ఇవే


అమరావతి స్మార్ట్ సిటీ కింద.. సిటీ స్మార్ట్ డక్ట్ ప్రాజెక్టు పవర్, ఫైబర్, సిటీ గ్యాస్ ప్రాజెక్టును రూ.270 కోట్లతో పూర్తి చేశారు. అలాగే రూ. 150 కోట్లతో అమరావతి స్మార్ట్ సిటీ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయింది. కాంప్లెక్స్ - సెంట్రల్ పార్క్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు రూ.23 కోట్లు ఖర్చు చేశారు. మన అమరావతి సిటిజన్ కార్డు యాప్ కోసం రూ.12.32 కోట్లు, స్మార్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూ.12.22 కోట్లు, 3డీ సిటీ ప్లానింగ్ మేనేజ్‌మెంట్ రూ.9.67 కోట్లు ఖర్చు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఫేజ్-2 ప్రాజెక్టును రూ. 6.56 కోట్లతో పూర్తి చేశారు. స్మార్టు వార్డులకు రూ.6.04 కోట్లు, ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టును రూ.4.54 కోట్లతో పూర్తి చేశారు. హబ్ (తొలి దశ) కు రూ.2.23 కోట్లు, ఈ-వాహనాలు, ఛార్జింగ్ వసతుల కల్పనకు రూ. 0.57 కోట్లు ఖర్చు చేశారు. 


వర్క్ ఆర్డర్ జారీ చేసిన ప్రాజెక్టులు


రూ.122.17 కోట్ల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ జారీ చేశారు. అలాగే రూ.58.02 కోట్ల సామాజిక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు, రూ.28.86 కోట్ల స్మార్ట్ పోల్స్, రూ.27.06 కోట్ల అంగన్ వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల ప్రాజెక్టుకు వర్క్ ఆర్డర్ జారీ చేశారు. రూ. 25 కోట్ల నైబర్ హుడ్ స్కూళ్లు, రూ. 21.75 కోట్ల వాటర్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, రూ. 20 కోట్ల హెల్త్ కేర్ సెంటర్ ప్రాజెక్టుకు వర్క ఆర్డర్ జారీ చేసినట్లు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. 


Also Read: Tomato Price Drop: దిగొస్తున్న టమాటా ధర - భారీగా తగ్గుదల, హైదరాబాద్‌లో ఎంతంటే?


విశాఖలో రూ.942 కోట్ల విలువైన ప్రాజెక్టులు


అలాగే విశాఖపట్నం స్మార్ట్ సిటీ కింద రూ.942 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.452.25 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అమృత్ పథకం కింద విజయనగరంలో రూ.46.96 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చారు. ఇందులో రెండు నీటి సరఫరా ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఒక మురుగు నీటి పారుదల వ్యవస్థ, 3 పార్కులు ఉన్నాయని, ఇవన్నీ పూర్తి అయ్యాయని వివరించారు.