Tomato Price Drop: నిన్న, మొన్నటి వరకు అందనంత ఎత్తులో ఆకాశంలో విహరించిన టమాట ధర క్రమంగా కిందకు దిగి వస్తోంది. రెండ్రోజుల నుంచి టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు కిలో టమాటా రూ. 200 లకు పైగా అమ్ముడు పోగా.. రూ. 300 దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ టమాటా ధర తగ్గుతోంది. కిలో టమాటాను రూ. 250కి పైగా అమ్మిన వ్యాపారులే ఇప్పుడు రూ. 63 విక్రయిస్తున్నారు. హైదరాబాద్ రైతు బజార్ లో కిలో టమాటా రూ. 63 గా ఉంది. బయట మార్కెట్లలో టమాటా ధర ఇంకా ఎక్కువగానే ఉంది. రూ. 120 నుంచి రూ. 140 వరకు విక్రయిస్తున్నారు. మొన్నటి కంటే రెండ్రోజుల నుంచి మార్కెట్ కు అధిక మొత్తం టమాటా వస్తోంది. 10 రోజుల క్రితం వరకు హైదరాబాద్ హోల్‌సెల్ మార్కెట్ కు కేవలం 850 క్వింటాళ్ల టమాటా మాత్రమే రాగా.. సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల పంట వచ్చింది. ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి అధిక దిగుబడి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్ పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలోనే హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్ కు టమాటా వస్తోంది. దీంతో సప్లై ఎక్కువగా ఉండటంతో డిమాండ్ తగ్గింది. దాని వల్ల టమాటా ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కిలో టమాటా రూ. 50 లోపు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీ మార్కెట్లలోనూ తగ్గిన టమాటా ధరలు
అటు ఏపీ మార్కెట్లలోనూ టమాటా ధరలు పడిపోయాయు. కిలోకు రూ. 100 వరకు విక్రయించగా.. ఇప్పుడు రూ. 65 వరకే టమాటాలు లభిస్తున్నాయి. ఉన్నట్టుండి టమాటా ధర తగ్గడంతో టమాటా సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టినా ఉత్తరాది రాష్ట్రాల్లోని ధరలు ఇంకా భారీగానే ఉండటంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం మార్కెట్ లో మొదటి రకం టమాటా కిలో రూ. 110 గా ఉంది. రెండో రకానికి రూ. 90 పలికింది. మూడో రకం టమాటాకు రూ.75 చొప్పున విక్రయిస్తున్నారు. 15 కిలోల బుట్ట మొదటి రకం అయితే రూ.1650, రెండో రకానికి రూ.1350, మూడో రకం టమాటాకు రూ. 1125 చొప్పున విక్రయిస్తున్నారు.
Also Read: IIT-Hyderabad: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి బలన్మరణం, సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే!
మార్కెట్లో మాత్రం కానరాని తగ్గుదల
హైదరాబాద్ నగరానికి వస్తున్న టమాటాల ధరను డిమాండ్ ఆధారంగా నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి ధరలను నిర్ణయిస్తారు. ఆయా ధరల ప్రకారమే రైతు బజార్లలో విక్రయాలు జరపాల్సి ఉంటుంది. ఐతే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాలకు ఒకే విధమైన ధర తీసుకుంటారు. ధరల పట్టికలోనూ మొదటి రకానికి చెందిన ధరలనే రాస్తారు. కిలో టమాటా రూ. 63 కు తగ్గినా.. రైతు బజార్లలో మాత్రం వినియోగదారులకు రూ. 63 కు టమాటాలు లభించవు. మొదటి రకం ధర రూ.100 కాగా.. అదే ధరలో రెండో రకం టమాటాలకు కూడా విక్రయిస్తున్నారు. దీని వల్ల టమాటా ధర తగ్గిన ప్రయోజనం కొనుగోలుదారులకు అందకుండా పోతుంది.