Mokila Auction: హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నాయి. కోకాపేటలో ఇటీవలే ఎకరా దాదాపు రూ.101 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఒక్క కోకాపేటే కాదు. చుట్టుపక్కల భూముల రేట్లు  సైతం భారీగానే ఉన్నాయి. మోకిలా పరిసర ప్రాంతాల్లోనూ స్థిరాస్తి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సోమవారం నార్సింగి-శంకర్‌పల్లి రహదారి పక్కనే ఉన్న మోకిల గ్రామంలోని 165 ఎకరాల లేఅవుట్‌ను ప్రభుత్వం వేలం వేయగా చదరపు గజం మార్కెట్‌ ధర కంటే మూడింతలు పలికింది. 


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎమ్‌డిఎ) నిర్వహించిన వేలంలో ప్లాట్‌కు అత్యధికంగా బిడ్‌లో చదరపు గజానికి రూ. 1.05 లక్షలు (ప్లాట్ నెం. 242 కోసం) పలికింది. అత్యల్పంగా చదరపు గజానికి రూ.72,000 పలికింది. (ప్లాట్ నం. 266 & 311). సగటున చదరపు గజం రూ. 80,397 పలికింది.
 
మొత్తంగా రాష్ట్రంలో 50 ప్లాట్లలో 48ను ప్రభుత్వం విక్రయించింది. మరో రెండు ప్లాట్లను తప్పుడు బిడ్‌ల కారణంగా వేలాన్ని రద్దు  చేశారు. ప్లాట్ల కొలతలు 300 నుంచి 500 చదరపు గజాల మధ్య ఉంటుంది.  వీటి ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ. 121 కోట్ల ఆదాయం వచ్చింది.  


ప్లాట్లకు విపరీతమైన స్పందన వచ్చిందని, త్వరలో మోకిలాలో 2వ దశ వేలంపాట ఉంటుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్) అరవింద్ కుమార్ చెప్పారు. లేఅవుట్ డెవలపర్లు ఈ ప్రాంతంలో చదరపు గజం రూ. 30,000 విక్రయిస్తున్నారని, ప్రస్తుత వేలంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చిందన్నారు. దీనిపై  రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.   


ప్లాట్లకు మంచి ధర రావడానికి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలే కారణమని  హెచ్‌ఎమ్‌డీఏ అధికారులు తెలిపారు. టైటిల్ గ్యారెంటీ, సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, వివాదాలు లేని స్థలానికి ప్రభుత్వం నుంచి హామీ ఇస్తున్నందున, బిడ్డర్లు పోటీ పడుతున్నారని, తమ స్థలాలను దక్కించుకోవడానికి ప్రీమియం చెల్లించడానికి ఇష్టపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. 


వాస్తవానికి HMDA ఒక చదరపు గజానికి రూ. 25,000 ధరగా నిర్ణయించిందని, దాని ప్రకారం ప్రభుత్వానికి రూ. 40 కోట్లు మాత్రమే రావాలని, అయితే కానీ దానికి మూడు రెట్లు ఎక్కువ వచ్చిందని ఓ అధికారి తెలిపారు. మోకిలాలో మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.  


ఈ లేవుట్లలో ఫుట్‌పాత్‌లతో కూడిన రోడ్లు, సెంట్రల్ మీడియన్‌లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, ఓవర్‌హెడ్ ట్యాంకులతో కూడిన నీటి సరఫరా పంపిణీ, తుఫాను నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, అన్ని మౌలిక సదుపాయాలను HMDA 18 నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.  


కోకాపేటలో రికార్డు ఆదాయం
కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఇక్కడి నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో భూముల ధర హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. అయితే ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దీంతో చరిత్రలోనే అత్యధిక ధర నమోదయింది.