BJP On Polavaram : పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి భరించేందుకు సిద్ధంగా ఉన్నా రెండు ప్రభుత్వాలు చెరో ఐదేళ్ల పాటు సమయం వృధా చేసి.. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల పోలవర విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర వివాదాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం జగన్ పోలవర నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
పోలవరం తప్పు మీదంటే మీదని టీడీపీ, వైసీపీ విమర్శలు
చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటించి.. తమ హయాంలో గొప్పగా కట్టామని..జగన్ విఫలమయ్యారని ఆరోపించారు .దీనికి రివర్స్‌లో చంద్రబాబు వల్లే పోలవరంలో ఇబ్బందులు వచ్చాయని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ప్రజల్ని మభ్య పెడుతున్నాయని.. పోలవరం విషయంలో తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ భావిస్తోంది. పోలవరం విషయంలో వడ్డించిన విస్తరిని ముందు పెట్టి ప్రజల కడుపు నింపమని చెప్పినా కాంట్రాక్టుల కక్కుర్తితో కాళ్లతో వైసీపీ, టీడీపీ తన్నేసుకున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వడ్డించిన విస్తరిలా పోలవరం నిధులను కేంద్రం ఇస్తే.. రెండు పార్టీలు కలిసి కాళ్లతో తన్నేశాయన్నారు.
పదేళ్లలో రెండు పార్టీలు కట్టలేకపోయాయి !
ఏపీ జీవనాడి పోలవరం విషయంలో జరుగుతోంది ఇదేనన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టులను.. చంద్రబాబు తామే కట్టుకుంటామని తీసుకున్నారు. 2018కే పూర్తి చేస్తామని ప్రకటనలు చేశారు. కానీ చివరికి ఎటూ కాకుండా చేశారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్ిచన వైసీపీ ప్రభుత్వం మరింతగా పోలవరం ప్రాజెక్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంట్రాక్టర్లను మళ్లీ మార్చేసి.. ఇప్పుడు నేడు ఖర్మ కొద్దీ కేంద్రం కడుతోందని నిందలేస్తున్నరని విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ జీవనాడి విషయంలో రెండు పార్టీలకూ చేతకాక ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ముంచేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టేశారన్నారు.
రెండు పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే !
పోలవరం విషయంలో కేంద్రం వంద శాతం నిధులిస్తున్నా .. ప్రజలు ఒక్కో సారి అధికారం ఇచ్చినా ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు చేతకాలేదన్నారు. అంటే ఆ రెండు ప్రాంతీయ పార్టీలు చేతకాని పార్టీలు అని విష్ణువర్దన్ రెడ్డి తేల్చేశారు. కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక మీరేమీ చేయలేరు.. చేయాల్సిన అవసరం లేదని విష్ణువర్ద్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత ఏపీలో NDA ప్రభుత్వం వస్తుంది. పోలవరం కట్టి చూపిస్తుందన్నారు. ఏపీ ప్రజలకు రెండు ప్రాంతీయ పార్టీలు క్షమాపణలు చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పరిపాలించి మేలు చేయమని చెరో సారి ప్రజలు అధికారం ఇస్తే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను అంధకారం చేశారన్నారు.