Vastu Tips In Telugu: మొక్కలు, పచ్చదనం అంటే ఇష్టం ఉండనివారుండరేమో. గాలిని శుద్ధిచేస్తాయి, మనసుని ఉత్సాహపరుస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి.  అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వాటివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాదు... ఏపని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందట.


వృక్షాల మూల స్వభావాన్ని - కొన్ని గ్రహాల స్వభావాలను అనుసరించి ఇలా అనుసంధించారు వాస్తు శాస్త్ర నిపుణులు


మహావృక్షాలు - సూర్యుడు
పాలచెట్టు - చంద్రుడు 
కరముగల చెట్లు - కుజుడు 
ఫలమునిచ్చే చెట్లు -గురువు 
నీరస వృక్షములు - శుక్రుడు 
పుట్టలు మొదలైనవి - రాహుకేతువులు 


ఏ దిశలో ఏ చెట్టు ఉండాలి


ఈ చెట్లన్నింటిలోను కొన్ని మాత్రమే గృహావరణలో పెంచుకోవచ్చు.  తూర్పు దిశలో మఱ్రిచెట్టు, దక్షిణ దిశలో అత్తిచెట్టు, పడమర దిశలో జమ్మి చెట్టు, ఉత్తరదిశలో జువ్విచెట్టు, ఈశాన్యంలో రావి చెట్టు, ఆగ్నేయంలో మేడిచెట్టు, నైరుతిలో దుర్వాదుర్శనచెట్టు, వాయువ్యంలో మోదుగచెట్టు ఉంటే ఈ ఇంటి యజమానికి మేలు జరుగుతుంది. కొబ్బరిచెట్లు, పనసచెట్లు గృహావరణలో ఏ దిక్కున ఉన్నా శుభఫలితాలను ఇస్తాయి.


Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి


ఏ దిశలో ఏ చెట్లు ఉండకూడదు


అలాగే తూర్పున రావి చెట్టు, దక్షిణాన దువ్వి చెట్టు, పడమరలో మఱ్రిచెట్టు, ఉత్తరాన అత్తిచెట్టు ఉంటేమాత్రం ఆ ఇంట్లో ఉండే గృహ యజమానికి కీడు జరుగుతుందని చెబుతారు వాస్తుశాస్త్ర పండితులు. ఇంకా చింతచెట్టు, మారేడు చెట్టు, తాటి చెట్టు, రేగు చెట్టు, కుంకుడు చెట్టు, కానుగ చెట్టు, మోదుగ చెట్టు, సంపెంగ చెట్టు, గౄహావరణలో ఎక్కడ ఉన్నా ఆ ఇంటి యజమానికి కష్టాలు తప్పవంటారు. పాలు కారే చెట్లుంటే ఆర్థిక నష్టం
ముళ్ళ చెట్లు ఉంటే శత్రువృద్ది భయపెడుతుంది.  ఇంటికి దక్షిణ దిశలో కానీ, సమీపంలో కానీ చెంపక వృక్షం, పాటల వృక్షం, అరటి చెట్టు, జాజి, కేతకి చెట్లు ఉంటే నిత్యం ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతుంటుంది. ఆగ్నేయంలో పాలుకారే చెట్లు, అశ్వత్థ వృక్షం, జువ్వి చెట్టు ఉంటే పీడలు, మృత్యుభయం తప్పదు. ముఖ్యంగా ఈశాన్యం వైపు  పెద్దపెద్ద చెట్లు ఉండటం అస్సలు మంచిది కాదట. దానివల్ల సంపద హరిస్తుందని అంటారు. 


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే


ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లు


చింత ఇంట్లో పెంచలేరు కానీ చివరకు ఇంటి ఆవరణలో కూడా ఉండకూదంటారు వాస్తు నిపుణులు. ఇంటి ఆవరణకు కాస్త దూరంగా ఉండొచ్చు. చింత చెట్టు ఇంటి ఆవరణలో, గార్డెన్లో ఉంటే దరిద్రం వెంటాడుతుందట. 
పూజకు అవసరం అనే ఉద్దేశంతో కొందరు పత్తి మొక్కలు పెంచుతారు. కానీ ఈ మొక్కలు తోటల్లో ఉండాలి కానీ ఇంటి ఆవరణలో కాదంటారు. ఇవి నెగెటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తాయట.
ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు,మొక్కలు అస్సలు ఉండకూడదని వాటిద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వ్యాప్తిస్తుందని చెబుతారు


Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.   వ్యక్తిగత వివరాల కోసం వాస్తు పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.