భారతీయ జనతా పార్టీ రాజకీయాలను కనుచూపుతో శాసించే కేంద్రహోంమంత్రి అమిత్ షా ఏపీ బీజేపీని గాడిలో పెట్టేందుకు ఓ పూట వెచ్చించారు. సదరన్ కౌన్సిల్ భేటీకి తిరుపతి వచ్చిన అమిత్ షా ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు ప్రత్యేకంగా తన షెడ్యూల్‌ను ఓ రోజు పొడిగించుకున్నారు. ఆదివారం రాత్రి దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం పూర్తయిన తర్వాత ఆయన ఢిల్లీ తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం కూడా తిరుపతిలో ఉన్నారు. ఉదయం నుంచి దాదాపుగా నాలుగు గంటల పాటు వారితో సమావేశమయ్యారు.
Also Read : కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం
సమావేశం తర్వాత బయటకు వచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా కనిపిస్తున్నందున బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అమిత్ షా ఆదేశించారని చెప్పారు. పురందేశ్వరి కూడా దాదాపుగా ఇదే చెప్పారు. అయితే అంతర్గతంగా మాత్రం అమిత్ షా నేతలకు సూటిగా, స్పష్టంగా కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఉన్న వర్గాలు ఓ వర్గం అధికార పార్టీకి మద్దతుగా మరో వర్గం వ్యతిరేకంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
Also Read : కుప్పంలో రచ్చ - మిగతా చోట్ల చెదురుమదురు ఘటనలు .. ముగిసిన ఏపీ మినీ లోకల్ వార్
ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్‌లపై అమిత్ షా మండిపడినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు ప్రధాన శత్రువుని.. ప్రజావ్యతిరేకత పెరుగుతున్నందున ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండకూడదని తేల్చి చెప్పినట్లుగా చెబుతున్నారు. అదేసమయంలో గంట సేపు టీడీపీ నుంచి వచ్చిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో అమిత్ షా విడిగా భేటీ అయ్యారని చెబుతున్నారు. వారు కూడా తమ పూర్వ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలపైనా చర్చించినట్లుగా చెబుతున్నారు. వారిని కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
పొత్తులపైనా ఇటీవల నేతలు ఒకరినొకరు విమర్శలు చేసుకున్నారు. పొత్తుల్లేవని సునీల్ ధియోధర్ ప్రకటించగా.. అది చెప్పడానికి మీరెవరని సీఎం రమేష్ ప్రశ్నించారు. చెప్పాల్సింది బీజేపీ జాతీయ అధ్యక్షుడన్నారు. ఇదే అంశాన్ని అమిత్ షా కూడా ప్రస్తావించి.. పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అమరావతి అంశం కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతికి మద్దతుగా తీర్మానం చేసి ఇప్పుడు మద్దతు ఇచ్చే వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటారని కూడా అమిత్ షా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలని దిశానిర్దేశం చేసినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నేతలతో సమావేశం తర్వాత అమిత్ షా ఢిల్లీ వెళ్లారు.
Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?
మరో వైపు ఇటీవల జరిగిన బద్వేలు ఉపఎన్నిక ఫలితంపైనా అమిత్ షా ఆసక్తిగా నేతల్ని అడిగి తెలుసుకన్నారు. సాధారణ ఎన్నికల్లో ఒక్క శాతం కూడా ఓట్లు సాధించకపోయినప్పటికీ రెండేళ్లలోనే 14శాతానికి పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అమిత్ షా తిరిగి వెళ్లే సమయంలో బద్వేలు నుంచి పోటీ చేసిన పనతల సురేష్‌ను బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమానాశ్రయంలో అమిత్ షాకు పరిచయం చేశారు. ఎన్నికల్లో బాగా పని చేశావని సురేష్‌ను అమిత్ షా అభినందించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి