Tiger That Ate Wild Boar in Gopalapuram: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గోపాలపురం (Gopalapuram) మండలం కరగపాడు (Karagapadu) గ్రామంలో శనివారం ఉదయం పులి ఓ అడవి పందిని చంపి మాంసాన్ని తింది. శివారు అటవీ ప్రాంతంలో ఈ దృశ్యాన్ని చూసిన రైతులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన తమకు పులి కనిపించిందని రైతులు చెబుతున్నారు. మామిడి తోటలో పులి గాండ్రింపులు విని పొలాల్లో పని చేసుకుంటున్న వారు ఆందోళనకు గురై పరుగులు తీశారు. కాగా, నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్దపులి నేడు 5 కిలోమీటర్ల సమీపంలో కరగపాడు గ్రామంలో అడవి పందిపై దాడి చేయడం అక్కడి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. తాజాగా పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు క్లుప్తంగా కనిపించడంతో రైతుల్లో అలజడి మొదలైంది. ఈ క్రమంలో వారు బయటకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ దీనిపై అటవీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



కొద్ది రోజులుగా భయంతో


కాగా, ఉమ్మడి తూ.గో జిల్లా వాసులను గత కొంత కాలంగా పెద్ద పులి వణికిస్తోంది. పలు మండలాల్లో సంచరిస్తూ గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల నల్లజర్ల మండలం పోతవరంలో కూడా పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పొలంలో పులి పాదముద్రలు సహా ఫెన్సింగ్ దాటిన సమయంలో తీగలకు చిక్కిన పులి జట్టును స్థానిక రైతులు గుర్తించారు. ఈ సమాచారాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. పాపికొండలు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి గత వారం రోజుల క్రితం బయటకు వచ్చిన పులి దెందులూరు వరకూ సంచరించింది. ఈ క్రమంలో రెండు పశువులపై దాడి చేసి చంపేసినట్లు అధికారులు గుర్తించారు. పులి సంచారం తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రాకూడదని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ దండోరా సైతం వేయించారు. తాజాగా, గోపాలపురంలో పులి కదలికలతో ఇక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు పులిని బంధించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


Also Read: CM Jagan: 'మీరు కృష్ణుడైతే నేను అర్జుడిని' - నా కోసం ప్రజలు ఒక్కసారి ఆ బటన్ నొక్కాలన్న సీఎం జగన్,