Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు ఎజెండా సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఇప్పటికే ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా నేతృత్వంలో భేటీ జరిగింది. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అయితే...ఇంకా ఎన్నికల ఎజెండాని మాత్రం ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 17,18వ తేదీల్లో జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది అధిష్ఠానం. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న సమావేశాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 18న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆయన చేతుల మీదుగా ఈ సమావేశాలు ముగుస్తాయి. అంతకన్నా ముందే మరో కీలక భేటీ జరగనుంది. జనరల్ సెక్రటరీలు, మున్సిపల్ కార్పొరేషన్‌, నగర పంచాయితీలు, జిల్లా పంచాయితీల అధ్యక్షులందరికీ హైకమాండ్ ఆహ్వానం అందించింది. ఇక రెండు రోజుల సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ కార్యదర్శితో పాటు జిల్లాల అధ్యక్షులు, లోక్‌సభ కన్వీనర్‌లు, క్రమశిక్షణా కమిటీ, ఆర్థిక కమిటీ సభ్యులు, ఐటీ సెల్‌ అధికారులకు ఆహ్వానం పంపింది. రెండు రోజుల పాటు మేధోమథనం సాగనుంది. ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి ఎజెండాని సిద్ధం చేసి ఆ తరవాత అధికారికంగా ప్రకటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయమే ఉన్నందున వీలైనంత వేగంగా ఎజెండాని సిద్ధం చేసుకుని ప్రచారానికి రెడీ అయిపోవాలని భావిస్తోంది బీజేపీ. అంతే కాదు. ప్రధానిగా మూడోసారి మోదీ కచ్చితంగా గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 


లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. హ్యాట్రిక్‌ సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. బిహార్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వినోద్‌ తవ్‌దే, ఝార్ఖండ్‌కి లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్, హరియాణాకి విప్లవ్ కుమార్ దేవ్‌ని ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ పోలింగ్ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్ల సంఖ్య కోటి 73 లక్షల వరకూ ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం కోటిన్నర మంది సిబ్బందిని నియమించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 1951 నాటికి దేశవ్యాప్తంగా ఓటర్ల సంఖ్య 17.32 కోట్లుగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1957 నాటికి అది 19.37 కోట్లకు పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 91.20 కోట్లుగా ఉంది. ఇప్పుడది 96 కోట్లకు పెరిగింది. ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్న వాళ్లలో 18 లక్షల మంది దివ్యాంగులున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 67% ఓటింగ్ నమోదైనట్టు ఈసీ స్పష్టం చేసింది.  Modi Ko Chunte Hain పేరుతో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ప్రత్యేకంగా ఓ పాట కూడా విడుదల చేసింది. "కల కాదు..ఇదే నిజం. మళ్లీ ప్రజలు మోదీనే ఎన్నుకుంటారు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బీజేపీ నేతలు.


Also Read: అద్వానీకి భార‌త‌రత్న వెనుక‌ మోడీ రాజ‌కీయ వ్యూహాలు.. తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు !