YSRCP Nellore Politics : నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వొద్దని పట్టుబట్టిన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. అనిల్ కుమార్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాత్రం అనిల్ సూచించిన ఖలీల్ అహ్మద్ ను నియోజకవర్గ ఇంచార్జుగా నియమించారు. ఖలీల్ అహ్మద్.. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రధాన అనుచరుడు. సమన్వయకర్తగా ప్రకటించగానే అనిల్ తో కలిసి ఆయన సీఎం జగన్ ను కలిశారు.
అనిల్ కుమార్ యాదవ్ వల్లే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనను నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సంతోషంగా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. ”నాకు ఈ టికెట్ రావడం వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కృషి ఎంతో ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు లేవు. వైఎస్ఆర్ కాంగెస్ నాయకులమంతా కలిసే ఉన్నాం. మేమంతా కలిసి పని చేస్తాం. జగన్‌ను మళ్లీ సీఎం చేస్తామ”ని ఎండీ ఖలీల్ అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఖలీల్ ను ఎంపిక చేయడాన్ని నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా స్వాగతించారు.
కానీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం అసంతృప్తికి గురయ్యారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరు ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్నారు వేమిరెడ్డి. వేమిరెడ్డి తన సతీమణి ప్రశాంతి రెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఒక వేళ మైనార్టీకి ఇవ్వాలనుకుంటే మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్‌కు ఇవ్వాలని సిఫారసు చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం అనిల్ కుమార్ చెప్పిన నేతకే ప్రయారిటీ ఇచ్చారు. తాను చెప్పింది వైసీపీలో జరగకపోవడంతో మనస్తాపం చెందారు. ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు.
వేమిరెడ్డి సీఎం జగన్ కు ఉన్న అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న ఆయన.. వైసీపీ కోసం నిధుల సమీకరణలో కీలక పాత్ర పోషిస్తారని అంటారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఏప్రిల్ లో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మళ్లీ ఆయనను రాజ్యసభకు పంపకుండా.. పార్లమెంట్ కు పోటీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంచార్జ్ గా నియమించారు.