CM Jagan Comments in Denduluru Siddam Meeting: 'మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా.?' అని సీఎం జగన్ (CM Jagan) దెందులూరు (Denduluru) 'సిద్ధం' సభలో ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. వైసీపీని మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. 'రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోంది. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించండి. సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. రామాయణం, మహాభారతంలో విలన్లు చంద్రబాబు (Chandrababu) అండ్ కో రూపంలో ఉన్నారు. వారికి ఉన్న సైన్యం పొత్తులు అయితే.. నాకున్న తోడు, ధైర్యం, బలం.. పైనున్న దేవుడు, ప్రజలు' అని జగన్ అన్నారు.










చంద్రబాబు ఏం చేశారు.?






టీడీపీ అధినేత చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారని.. 14 ఏళ్లు సీఎంగా చేసిన ఆయన ప్రజల కోసం ఏం చేశారు.? అని సీఎం జగన్ దెందులూరు సభలో నిలదీశారు. 'ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ప్రజల ఖాతాల్లో వేశారా.?' అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరు అని ఆరోపించారు. 'వైసీపీ ప్రభుత్వంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా 500లకు పైగా సేవలు అందిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దకే పథకాలు అందేలా చేస్తున్నానం. డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తున్నాం. పార్లీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నేడు 66 లక్షల కుటుంబాలకు రాష్ట్రంలో సంక్షేమం అందుతోంది. నాడు - నేడు స్కూళ్ల రూపు రేఖలు మార్చేశాం. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాం.' అని జగన్ వివరించారు.


పింఛన్ల పెంపుపై


'రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్ నిర్ణయించేవి. రూ.3 వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్తులో పెరగాలన్నా మీ జగనే మళ్లీ అధికారంలోకి రావాలి. నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి. ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ వివరించాలి.' అని పిలుపునిచ్చారు.


'మీరు ఆ బటన్ నొక్కండి'






తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అన్న సీఎం జగన్.. దెందులూరు సభలో వారికి కీలక సూచనలు చేశారు. 'పేదల సొంతింటి కల నెరవేరాలన్నా.. రైతు భరోసా కావాలన్నా మళ్లీ జగనన్నే రావాలని చెప్పండి. పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కాం. రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. మీరు నా కోసం ఒక్కసారి బటన్ నొక్కండి. ఒకటి అసెంబ్లీ, ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కాలి.' అంటూ పిలుపునిచ్చారు.


Also Read: Nellore YSRCP : నెల్లూరు సిటీ సీటుపై మళ్లీ రచ్చ - అనిల్ మాటకే సీఎం జగన్ ప్రాధాన్యం - వేమిరెడ్డి అసంతృప్తి