TG SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న విడుదల! రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Telangana SSC 10th Results 2026: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29న విడుదలకానున్నాయి.

TS Board Result Dates

TG SSC 10th Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.28 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు(Telangana SSC Results 2026) బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ ఫలితాలను విడుదల చేయనుంది. హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లో ఉన్న గోదావరి ఆడిటోరియంలో ఫలితాలు విడుదల చేస్తారు. 

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్‌ టికెట్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. bse.telangana.gov.in, results.bse.telangana.gov.in, results.bsetelangana.org, ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లలో ఫలితాలు చూసుకోవచ్చు. 

వాట్సాప్ ద్వారా ఫలితాలు విడుదల చేయనున్నారు. మీ సేవ వాట్సాప్ నెంబర్‌ 8096958096కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీ ఫలితాలను చూసుకోవచ్చు. 

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు బోర్డు తెలిపింది. 

తెలంగాణ బోర్డు నిబంధనల ప్రకారం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సెబ్జెక్ట్‌లోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. అయితే సెకండ్‌ లాంగ్వేజ్‌లో మాత్రం కొంత మినహాయింపు ఉంటుంది. ఈ పేపర్‌లో 20 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. మొత్తం ఆరు వందల మార్కులకు బోర్డు ఫలితాలను గ్రేడింగ్ విధానంలో వెల్లడిస్తుంది. 91-100 మార్కులు వచ్చిన వాళ్లకు ఏ1 గ్రేడ్‌గా గుర్తిస్తారు. వారికి గ్రేడ్ పాయింట్లు పది ఇస్తారు. 81-90 మార్కులు వచ్చిన వారు ఏ2గా గుర్తించి   వారికి 9 గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. 35-40 మార్కులు వచ్చిన వారికి డీ గ్రేడ్‌గా గుర్తిస్తారు. అంతకంటే తక్కువ వస్తే వారిని ఫెయిల్ అయిన వారిగా తేలుస్తారు. 

ఫలితాలు రోజున వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే మార్క్‌ మెమో తాత్కాలికం మాత్రమే. విద్యార్థులు తమ అసలు సర్టిఫికెట్‌లను సంబంధిత పాఠశాలల నుంచి సేకరించుకోవాలి. అయితే విద్యార్థులకు మరింత ఈజీ యాక్సెస్ కోసం డిజీలాకర్‌ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. దీని కోసం డిజీలాకర్ యాప్‌లో సైన్‌ ఆప్ అవ్వాలి. ఎడ్యుకేషన్ విభాగంలో తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఎంచుకోని హాల్ టికెట్‌ వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఫలితాల విషయంలో సంతృప్తి చెందని విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పిస్తుంది. మార్కుల లెక్కింపులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే సబ్జెక్ట్‌కు ఐదు వందలు చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కోసం ఒక సబ్జెక్ట్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఇలా చేస్తే జవాబు పత్రాన్ని మళ్లీ చూడటంతోపాటు, జవాబు పత్రం ఫొటోకాపీ కూడా అందిస్తారు.  

సప్లిమెంటరీ పరీక్షలు 

ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జాన్ నెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే నెలలో ప్రారంభమవుతుంది. సప్లిమెంటరీ ఫలితాలు జులైలో విడుదలవుతాయి. విద్యార్థులు అదే సంవత్సరం పై చదువులకు వెళ్లొచ్చు.

 
 
Sponsored Links by Taboola