AP Government To Give Subsidy and Loans To SC Farmers: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ప్రోత్సాహకాలు పెరిగాయి. గతంలో పాలనకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి ప్రోత్సాహకాలు, నిధులు విడుదల చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ప్రకృతి సేద్యం (Natural Farming) చేస్తున్న, చేయాలని భావిస్తున్న ఎస్సీ రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసింది. కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా 71,560 మంది ఎస్సీ రైతులను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రకృతి సేద్యం చేస్తూ పర్యావరణానికి హాని కలిగించకుండా సాగు చేస్తున్న వారికి రూ.10 వేలు సబ్సిడీ కింద ఇవ్వనున్నారు. మరో రూ.40 వేలు రుణం కింద ఆ ఎస్సీ రైతనన్నలకు అందనుంది. సబ్సిడీ నగదును ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు రుణంగా పొందిన నగదును వాయిదా రూపంలో తిరిగి చెల్లించాలని నిర్ణయంచారు.
మార్చి నెలలో ప్రారంభం..
ప్రకృతి సేద్యం చేస్తున్న ఎస్సీ రైతులకు మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మూడు విడతల్లో రుణాలు అందిస్తారు. తొలి విడతలో 8,198 మంది రైతుల చేతికి నగదు అందనుండగా.. రెండో విడతలో గరిష్టంగా 34,100 మందికి, మూడో విడతలో 29,262 మంది ఎస్సీ రైతులకు రుణాలు అందిస్తారు. కేవలం ప్రకృతి సేద్యానికి మాత్రమే ఈ నగదును పెట్టుబడిగా వినియోగించాలని సూచించారు. ఎస్సీ రైతుల కుటుంబాల్లోని మహిళల పేరిట మాత్రమే రుణాలు మంజూరు చేస్తారు. ఈ సామాజికి వర్గానికి చెందిన కౌలు రైతులు కూడా ఇందుకు అర్హులైనని సర్కార్ చెబుతోంది.
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్ చెప్పారు. రైతు సాధికార సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ సమన్వయంతో కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూస్తామన్నారు. అవసరమైతే ఆ రైతులకు రుణాలు అందించడంతో పాటు ప్రకృతి సేద్యంలో శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. పంట ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలోనూ సబ్సిడీ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ, రుణాలు అందించనుంది.
Also Read: YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ భరోసా నిధులు.. విడుదల చేసిన సీఎం జగన్
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!