వైఎస్ఆర్ రైతు భరోసా - ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు ఏపీలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మీట నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. మొత్తం 50,58,489 మంది లబ్ధిదారులకు గానూ రూ.1,036 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. తాజాగా నిధులతో పాటు గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం రూపేణా రైతులకు లేదా లబ్ధిదారులకు అందించినట్లయింది.
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున ఎకరాకు అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ ఆర్థిక ఏడాది 2021–22 ఆర్థిక సంవత్సరానికి గానూ రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమ చేశారు. ఈ మొత్తంలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద రూ.3,848.33 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ సమ్మాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం అందించింది.
లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ కింద కేంద్రం అందించిన రూ.4 వేలు సాయం చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలు దారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఖాతాల్లో జమ చేసింది.
ఇప్పుడు మూడో విడతలో ఇలా..
ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగు హక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలు దారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది.
ఢిల్లీకి సీఎం జగన్
వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అనంతరం సీఎం జగన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఉంది. భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: COVID Vaccine: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి
Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ