మహిళలు వాయుకాలుష్యానికి గురైతే లావైపోతారట వాయు కాలుష్యం వల్ల మగవారి కన్నా ఆడవారే ఎక్కువ ఇబ్బంది పడతారని ఓ అధ్యయనం తేల్చింది. ఎవరైతే రోజూ వాయు కాలుష్యం బారిన పడతారో వారు త్వరగా బరువు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెప్పారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలపై వాయు కాలుష్యం తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని చెప్పారు అధ్యయనకర్తలు. ఈ అధ్యయనం కోసం 1600కు పైగా చైనీస్, జపనీస్, ఆఫ్రికా మహిళలను ఎంపిక చేశారు. వీరి ఆరోగ్యాన్ని, బరువును 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ట్రాక్ చేశారు. వాయు కాలుష్యం, శారీరక శ్రమ మధ్య పరస్పర చర్యలను పరిశోధకులు అధ్యయనం చేశారు. అందులో వాయుకాలుష్యానికి అధికంగా గురవుతున్న మహిళల శరీరంలో కొవ్వు శాతం పెరిగినట్టు గుర్తించారు.